ఇన్స్పైర్ మనక్ జాతీయ పోటీల్లో సంగారెడ్డి విద్యార్థుల ఘన విజయం
అంతర్జాతీయ స్థాయికి ఇద్దరు ఎంపిక
త్వరలోనే రాష్ట్రపతి భవన్కు పయనం
జపాన్ టూర్కు అర్హత పొందిన ప్రతిభావంతులు
విద్యార్థులను, గైడ్ టీచర్లను ఘనంగా సత్కరించిన కలెక్టర్ ప్రతీక్ జైన్, డీఈఓ రోహిణి
సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి :
న్యూఢిల్లీలోని భారత్ మండపం ప్రాంగణంలో ఇటీవల (అక్టోబర్ 12 నుండి 14 వరకు) నిర్వహించిన 12వ ‘ఇన్స్పైర్ మనక్’ అవార్డ్స్ (2023-24 & 2024-25) జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్రంతో పాటు సంగారెడ్డి జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నుండి 52 ప్రాజెక్టులు పాల్గొనగా, జాతీయ స్థాయిలో ఎంపికైన టాప్ 60 ప్రాజెక్టులలో రాష్ట్రం నుండి ఐదుగురు విద్యార్థులు చోటు దక్కించుకున్నారు.ఇందులో సంగారెడ్డి జిల్లా నుండి నలుగురు విద్యార్థులు జాతీయ స్థాయిలో పాల్గొనగా, ఏకంగా ముగ్గురు విద్యార్థులు టాప్ 60 లో నిలవడం, అందులో ఇద్దరు అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడం విశేషం.
శాస్త్రవేత్తలుగా జిల్లాకు మంచి పేరు తేవాలి: కలెక్టర్ ప్రతీక్ జైన్
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా విద్యాశాఖ అధికారిణి . రోహిణి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, గైడ్ టీచర్లకు, పాఠశాల యాజమాన్యానికి శాలువా, జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ “విద్యార్థులందరూ భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదిగి సంగారెడ్డి జిల్లాకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలి. సమాజంలో మనముందున్న సమస్యలకు శాస్త్రీయ దృక్పథంతో నూతన ఆవిష్కరణలు చేసి, దేశాభివృద్ధికి ఉపయోగపడేలా స్థిరపడాలి” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏడీ శంకర్, ఏఎంఓ బాలయ్య, జిల్లా సైన్స్ అధికారి పి. సిద్ధారెడ్డి, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ వెంకటస్వామి, ఆరిజిన్ పాఠశాల కరస్పాండెంట్ ప్రమోద్, అలేఖ్య, వేణుగోపాలరెడ్డి, పద్మావతి, అశ్విన్ కుమార్, వెంకటేష్, రఘునందనరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
