సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి :
సంగారెడ్డి పట్టణంలో మత సామరస్యానికి, ఆధ్యాత్మిక శోభకు ప్రతీకగా నిలిచే ఆధ్యాత్మిక ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పునరుద్ఘాటించారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని బ్రాహ్మణవాడలో ఉన్న చారిత్రక గురునానక్ మందిరంను సందర్శించిన ఆయన, అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మందిరం అభివృద్ధిలో భాగంగా గత గురునానక్ జయంతి సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, మందిరానికి సంబంధించి రెండు భారీ స్వాగత తోరణాల (కమాన్ల) నిర్మాణానికి ఆయన వైభవంగా భూమిపూజ నిర్వహించారు.గురునానక్ మందిరానికి వచ్చే భక్తులకు మార్గనిర్దేశకంగా ఉండేలా, ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు రెండు కమాన్లను ఏర్పాటు చేస్తున్నారు:ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ గత గురునానక్ జయంతి వేడుకల సందర్భంగా సిక్కు సమాజ ప్రతినిధులు కోరిన మేరకు ఈ కమాన్ల నిర్మాణానికి హామీ ఇచ్చానని, ఆ మాట ప్రకారమే ఈ రోజు భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమాన్ల నిర్మాణ పనులను వేగవంతంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

నాగదేవత ఆలయ సమగ్ర అభివృద్ధికి ఆదేశం:
గురునానక్ మందిర్ ప్రాంగణంలోని రావిచెట్టు కింద ఉన్న పురాతన నాగదేవత ఆలయాన్ని కూడా మోడరనైజ్ చేసి అభివృద్ధి చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్‌కు జగ్గారెడ్డి సూచించారు. ప్రస్తుతం ఉన్న నాగదేవత విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కదల్చకుండా, యథాస్థానంలోనే ఉంచి చుట్టూ భక్తులకు సౌకర్యంగా ఉండేలా అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సిక్కు ప్రముఖులు డాక్టర్ సర్దార్ సురేందర్ గోపి సింగ్, సర్దార్ తేజేందర్ సింగ్, సర్దార్ స్వరణ్ సింగ్, సర్దార్ సత్పాల్ సింగ్, డాక్టర్ సర్దార్ భరత్ సింగ్, సిక్కు గురువు గురుదేవ్ సింగ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్, నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, మహేష్ ముదిరాజ్, శ్రీహరి, సుదీప్, నరేన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
