సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ..
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి క్రీడాకారుల పట్ల మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. స్వతహాగా క్రీడాకారుడు అయిన ఎమ్మెల్యే జిఎంఆర్ క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో టోర్నమెంట్ ల నిర్వహణకు నిధులు అందిస్తూ క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నవంబర్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా జరగనున్న 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయస్థాయి కుస్తీ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అండర్-17 బాల బాలికల జట్లకు ఎమ్మెల్యే జిఎంఆర్ సొంత నిధులతో కొనుగోలు చేసిన స్పోర్ట్స్ కిట్లను క్రీడాకారులకు అందజేశారు.బుధవారం సాయంత్రం పటాన్ చెరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పటాన్చెరు కేంద్రంగా ఎస్జిఎఫ్ రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం జరిగిందని తెలిపారు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర జట్టుకు లక్ష 50 వేల రూపాయల సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్, భోజన వసతి, ప్రయాణ ఖర్చులు అందించడం జరిగిందని తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.జాతీయస్థాయిలో అద్భుతమైన ప్రదర్శనతో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, ఎంఈఓ నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, శ్రీధర్ చారి, మాణిక్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రామ్మోహన్, షకీల్, దస్తగిరి, కోచ్ సంగ్రామ్, పిఈటి గౌసుద్దీన్, క్రీడాకారులు పాల్గొన్నారు.
