ముఖ్య అతిథిగా పాల్గొని శోభాయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
వేలం పాటలో ₹5.53 లక్షల ఆదాయం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వరం బండ గ్రామంలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ పెద్దలు, 6వ వార్డు కౌన్సిలర్ అంతిరెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు గడ్డమీది ఆంజనేయులు ముదిరాజ్ ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా ప్రత్యేక పూజలు అందుకున్న దుర్గామాతను గురువారం నాడు వేడుకగా నిమజ్జనానికి తరలించారు.ఈ కార్యక్రమానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజలందరిపై అమ్మవారి కృపాకటాక్షాలు ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గ్రామంలో యువత, పెద్దలు కలిసి వరుసగా మూడో సంవత్సరం దసరా నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.
నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన వేలం పాటలో భక్తులు పోటాపోటీగా పాల్గొన్నారు. మొత్తం 13 మంది పాల్గొన్న ఈ వేలంలో రూ. 5,53,000 ఆదాయం సమకూరింది.రూ. 3,900 విలువైన నాణాల దండను కౌన్సిలర్ అంతిరెడ్డి రూ. 1,00,000లకు దక్కించుకున్నారు.అమ్మవారి చీరను గడ్డమీది ఆంజనేయులు రూ. 37,000లకు పాడుకున్నారు.
మరొక చీర: గ్రామానికి చెందిన యువ నాయకుడు మహమ్మద్ ఇబ్రహీం (ఇబ్బు) రూ. 20,000లకు సొంతం చేసుకున్నారు.
కులమతాలకు అతీతంగా ప్రతి పండుగను జరుపుకునే రామేశ్వరం బండ గ్రామంలో ముస్లిం యువకుడు మహమ్మద్ ఇబ్రహీం తన కుటుంబ సభ్యులతో విచ్చేసి అమ్మవారికి పూజలు నిర్వహించడం, వేలం పాటలో చీరను రూ. 20,000లకు దక్కించుకోవడం విశేషం. ఈ సందర్భంగా గ్రామస్తులు అతనిని, అతని కుటుంబ సభ్యులను అభినందించి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో రామేశ్వరం బండ మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి, ఇంద్రేశం మున్సిపాలిటీ చైర్మన్ ప్రమీల, కౌన్సిలర్ రమేష్, యువ నాయకులు గడ్డమీది ప్రశాంత్, సురేష్, అర్జున్, ఇబ్బుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, యువకులు పాల్గొన్నారు.
