చెడుపై మంచి విజయానికి ప్రతీక విజయదశమి.. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, ధర్మానికి విజయద్వారంగా నిలిచే విజయదశమి పండుగను పురస్కరించుకొని పటాన్‌చెరు పట్టణంలో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. మంగళవారం సాయంత్రం మైత్రి స్టేడియంలో నిర్వహించిన దసరా వేడుకల్లో పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
పండుగ వేడుకల్లో భాగంగా తొలుత జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద నిర్వహించిన ధ్వజారోహణ కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన షమీ పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తదుపరి స్థానిక ప్రజాప్రతినిధులు, పురప్రముఖులతో కలిసి మైత్రి స్టేడియంలో నిర్వహించిన రావణాసుర దహన కార్యక్రమానికి హాజరయ్యారు. రావణాసుర దహనంతో చెడుపై మంచి సాధించిన విజయాన్ని చాటుతూ నిర్వహించిన ఈ వేడుకలు ప్రజల్లో పండుగ ఉత్సాహాన్ని నింపాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ దసరా పండుగ ధర్మం, ధైర్యం, న్యాయం, సత్యం వంటి సద్గుణాలకు ప్రతీక అని పేర్కొన్నారు. రావణాసుర దహనం మనలోని చెడు ఆలోచనలు, అహంకారం, అన్యాయాలను విడిచిపెట్టి మంచిని ఆచరించాలనే సందేశాన్ని అందిస్తుందని తెలిపారు.విజయదశమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, సరికొత్త విజయాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే పండుగలను ప్రజలందరూ కలిసిమెలిసి జరుపుకోవడం మన సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.దసరా వేడుకలతో మైత్రి స్టేడియం పండుగ శోభను సంతరించుకోగా, రావణాసుర దహన కార్యక్రమం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక ప్రజాప్రతినిధులు, పురప్రముఖులు, ప్రజలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.

