ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న ఈడీఎఫ్ ముఖ్య సలహాదారు హిషామ్ ముండోల్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
అటవీ సంరక్షణ, సుస్థిర వ్యవసాయం, పునరుత్పాదక ఇంధన విస్తరణ, ఇంధన సామర్థ్యం మెరుగుదల పద్ధతుల ద్వారా భారతదేశ లక్ష్యమైన 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించగలమని పర్యావరణ రక్షణ నిధి (ఈడీఎఫ్)కి భారతదేశంలో ముఖ్య సలహాదారు హిషామ్ ముండోల్ ఆశాభావం వ్యక్తపరిచారు. గీతం, హైదరాబాదులోని కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కె.ఎస్.పి.పి)లో ‘ఉమ్మడి సుస్థిర శ్రేయస్సుకు ఒక భారతీయ మార్గం’ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఉద్గారాలను తగ్గిస్తూ, అభివృద్ధి, పర్యావరణ లక్ష్యాలను సాధిస్తూనే భారతదేశం ఆర్థిక వృద్ధిని ఎలా వేగవంతం చేయగలదో ఆయన వివరించారు.
తన విస్తృత అనుభవం ఆధారంగా, ముండోల్ సుస్థిర జీవనోపాధులు, వాతావరణ కార్యాచరణ, బాధ్యతాయుతమైన వ్యాపార పద్ధతులు, సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై అంతర్దృష్టులను పంచుకున్నారు. సైన్స్, ఆర్థిక శాస్త్రం, వాతావరణ పరిష్కారాల కూడలిలో ఈడీఎఫ్ చేస్తున్న కృషిని విద్యార్థులకు తెలియజేశారు. మీథేన్ శాట్ ఉపగ్రహ మిషన్ తో సహా వినూత్న పర్యావరణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో ఈడీఎఫ్ పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
2070 నాటికి నిరక సున్నా ఉద్గారాల దిశగా భారతదేశ మార్గాన్ని నొక్కి చెబుతూ, పునరుత్పాదక ఇంధన నిల్వ సవాళ్లను పరిష్కరించడం, ఎరువుల వినియోగాన్ని మెరుగుపరచడం, మెరుగైన పశువుల దాణా పద్ధతుల ద్వారా మీథేన్ ఉద్గారాలను తగ్గించడం వంటి వాటి ఆవశ్యకతను ఆయన విశదీకరించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ను ఉదహరిస్తూ, పర్యావరణ కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం ప్రాముఖ్యతను కూడా ఆయన స్పష్టీకరించారు. ఇండోర్ లో, వ్యర్థాలను వాటి మూలం వద్దనే వేరు చేయడంలో పౌరులు గణనీయమైన పురోగతి సాధించారన్నారు.ఈ సందర్భంగా, వాతావరణ విధానం, సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పురోగతిని సాధించడంలో మార్కెట్లు, సాంకేతికత పాత్ర వంటి అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ముండోల్ సమాధానమిచ్చారు.
వాతావరణ పరిష్కారాలు, మార్కెట్ ఆధారిత యంత్రాంగాలు, వాతావరణ సాంకేతికత ద్వారా సుస్థిర శ్రేయస్సుపై దృష్టి సారిస్తూ, భారతదేశంలో ఈడీఎఫ్ వ్యూహానికి ముండోల్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన విశిష్ట వృత్తి జీవితంలో చిల్డ్రన్స్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ ఫౌండేషన్, భారతదేశ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, వికీమీడియా ఫౌండేషన్లలో నాయకత్వ పాత్రలను పోషించారు.భారతదేశానికి మరింత సుసంపన్నమైన, సమానమైన భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడటానికి, ఆర్థిక వృద్ధి, పర్యావరణ సుస్థిరత, సమ్మిళిత ప్రజా విధానాలను ఏకీకృతం చేయడంపై ఈ ఉపన్యాసం విద్యార్థులకు విలువైన దృక్పథాలను అందించింది.
