చిట్కుల్ 7వ వార్డులో పార్కులు, రహదారుల స్థలాలను కాపాడాలి నవభారత్ నిర్మాణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్

politics Telangana

ప్లాట్లు, ఇళ్ల కొనుగోలులో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజావాణిలో యాదగిరి ఎంపీడీవోకు వినతిపత్రం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

చిట్కుల్ గ్రామంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ 7వ వార్డు పరిధిలో ఆమోదిత లేఅవుట్లలో ప్రజల వినియోగం కోసం కేటాయించిన పార్కులు, రహదారులు, సామాజిక మౌలిక సదుపాయాల స్థలాలు, ఇతర ఉమ్మడి స్థలాలను పరిరక్షించాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నవభారత్ నిర్మాణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ కోరారు. చిట్కుల్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 269, 284/పార్ట్, 303/పార్ట్, 304లో గ్రామ పంచాయతీ తీర్మానం నంబర్ 6/1, తేదీ 24-01-2007 ద్వారా ఆమోదించబడిన లేఅవుట్‌లో 1,763.83 చదరపు గజాల పార్కు స్థలం, 11,242.21 చదరపు గజాల రహదారుల స్థలం కేటాయించబడినట్లు సంబంధిత రికార్డుల్లో పేర్కొనబడిందని మెట్టు శ్రీధర్ తెలిపారు.అదేవిధంగా, సర్వే నంబర్లు 272, 303/పార్ట్‌లో హెచ్‌ఎండీఏ ఆమోదించిన లేఅవుట్ పర్మిట్ నంబర్ 000158/LO/Plg/HMDA/2019, తేదీ 11-06-2019 ప్రకారం 1,781.26 చదరపు మీటర్ల పార్కు/బహిరంగ స్థలం, 521.20 చదరపు మీటర్ల సామాజిక మౌలిక సదుపాయాల స్థలం కేటాయించబడినట్లు వివరించారు.

కొంతమంది బిల్డర్లు ఆమోదిత లేఅవుట్ల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, ప్రజల ఉమ్మడి వినియోగానికి కేటాయించిన స్థలాలకు ఆటంకం కలిగించేలా ప్రహరీ గోడలు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారనే అంశాలపై అధికారులు సమగ్ర విచారణ జరపాలని కోరారు. పార్కులు, రహదారులు, ఇతర ఉమ్మడి స్థలాల వివరాలను స్పష్టంగా తెలియజేయకుండా లేదా వాస్తవాలను దాచిపెట్టి ప్లాట్లు, ఇళ్లు విక్రయిస్తే అమాయక ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.సామాన్య ప్రజలు తమ జీవితకాల కష్టార్జితంతో ప్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేస్తున్నారని, అనంతరం భూమి హక్కులు, నిర్మాణ అనుమతులు, రహదారులు, పార్కులు, కోర్టు వివాదాలకు సంబంధించిన సమస్యలు ఎదురైతే ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. అందువల్ల ప్రజలు స్థలం లేదా ఇల్లు కొనుగోలు చేసే ముందు ఆమోదిత లేఅవుట్, సంబంధిత అనుమతులు, భూమి హక్కుల పత్రాలు, పార్కులు మరియు రహదారుల కేటాయింపులు, కోర్టు వివాదాలు ఉన్నాయా లేదా అనే అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.

మున్సిపల్ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, ఆమోదిత ప్రణాళిక ప్రకారం పార్కులు, రహదారులు, సామాజిక మౌలిక సదుపాయాల స్థలాల హద్దులను గుర్తించాలని కోరారు. ఈ స్థలాలు మున్సిపాలిటీకి అధికారికంగా అప్పగించబడ్డాయా, మున్సిపల్ ఆస్తుల రిజిస్టర్‌లో నమోదయ్యాయా అనే అంశాలను నిర్ధారించి, నిబంధనల ప్రకారం మున్సిపాలిటీ ఆధీనంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.పార్కులు, రహదారులు, ఇతర ఉమ్మడి స్థలాలను ఆక్రమించడం, అనుమతులు లేకుండా ప్రహరీ గోడలు నిర్మించడం లేదా ప్రజా వినియోగానికి కేటాయించిన స్థలాలను ఇతర అవసరాలకు మళ్లించడం వంటి ఉల్లంఘనలు గుర్తించినట్లయితే, తెలంగాణ మున్సిపాలిటీల చట్టం, 2019తో పాటు వర్తించే ఇతర చట్టాలు, నిబంధనల ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రజావాణిలో సమర్పించిన వినతిపై విచారణ జరిపి, క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వాస్తవాలను నిర్ధారించి, తీసుకున్న చర్యల వివరాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని మెట్టు శ్రీధర్ కోరారు.ఈ కార్యక్రమంలో రాజగోపాల్ యాదవ్, శ్రీకాంత్, మాణిక్య ప్రభు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *