రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి :
భారతీనగర్ డివిజన్ పరిధిలోని బాంబే కాలనీలో గత వారం రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతోందని స్థానిక ప్రజలు ఫిర్యాదు చేయడంతో మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈరోజు జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా బాంబే కాలనీలో ఇంటింటికీ వెళ్లి నీటి సరఫరా పరిస్థితిని పరిశీలించిన అనంతరం, రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని పాత రామచంద్రాపురంలో జరుగుతున్న రెండు నీటి మరమ్మతు పనులతో పాటు, వాసవి నగర్ కాలనీలో యూజీడీ (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) సమస్యను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు.బాంబే కాలనీలో గత వారం రోజులుగా కలుషిత నీరు వస్తోందని స్థానిక నివాసితులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, బీడీఎల్ అపార్ట్మెంట్ వద్ద డ్రైనేజీ నీరు తాగునీటి పైప్‌లైన్‌లో కలుస్తున్న ప్రదేశాన్ని గుర్తించారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి, కలుషిత నీటి సరఫరాకు కారణమైన లోపాన్ని సరిచేసి, కాలనీ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని నాయకులు సూచించారు. అలాగే యూజీడీ, నీటి మరమ్మతులకు సంబంధించిన సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జగన్నాధ్ రెడ్డి, పరమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
