పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఫార్మా మరియు రసాయన పరిశ్రమలలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వ యంత్రాంగం, ఫ్యాక్టరీస్ మరియు లేబర్ శాఖల నిర్లక్ష్య వైఖరిపై నవభారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజ్‌గోపాల్ యాదవ్, యువజన సంఘాల సమితి సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రోహిత్ సింగ్ మరియు మనీష్‌లతో కలిసి సరాక లాబొరేటరీస్ ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలిపారు గతంలో పాశమైలారం ‘సిగాచి’ పరిశ్రమలో జరిగిన ప్రమాదాలపై స్పందిస్తూ, పరిశ్రమల యాజమాన్యాల నిర్లక్ష్యం మరియు అధికారుల ఉదాసీనత వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని ధ్వజమెత్తారు.
సిగాచి, సరాక మరియు గడ్డపోతారం పారిశ్రామిక ప్రాంతాలలో సరైన ఫైర్ సేఫ్టీ లేకపోవడం, అనుమతులకు మించి ఉత్పత్తి చేపట్టడం, రియాక్టర్లు పేలడం వంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నా ఫ్యాక్టరీల శాఖ తనిఖీలు కేవలం నామమాత్రంగానే సాగుతున్నాయని విమర్శించారు. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరినా అధికారులు స్పందించకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు.ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన ఇక్కడ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్లో కనీసం వినతిపత్రం స్వీకరించడానికి కూడా ఏ ఒక్క అధికారి అందుబాటులో లేకపోవడం శోచనీయమన్నారు. ఫ్యాక్టరీస్ శాఖలో డైరెక్టర్లు, ఇన్స్పెక్టర్లతో పాటు తగినంత మంది సిబ్బంది లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని మండిపడ్డారు. అధికారుల కొరతను ఆసరాగా చేసుకుని కంపెనీ యాజమాన్యాలు కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతూ అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫ్యాక్టరీల శాఖలోని డైరెక్టర్లు, ఇన్స్పెక్టర్లు మరియు ఇతర ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పరిశ్రమల యాజమాన్యాలపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించని పరిశ్రమలకు నోటీసులు జారీ చేసి, అవసరమైతే క్లోజింగ్ ఆర్డర్లు ఇవ్వాలన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం కల్పించాలని, విధి నిర్వహణలో తీవ్రంగా గాయపడిన కార్మికులకు పూర్తి వైద్య ఖర్చులతో పాటు జీవితాంతం పెన్షన్ సౌకర్యాన్ని కంపెనీ యాజమాన్యాలు భరించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొన్నారు. ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రతి ఏటా అన్ని పరిశ్రమలలో ఆన్సైట్, ఆఫ్‌సైట్ ఎమర్జెన్సీ ప్లాన్లు మరియు మేజర్ యాక్సిడెంట్ హజార్డ్స్ (MAH) నిబంధనల అమలుపై సమగ్ర తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధితులకు పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు మరియు పారిశ్రామిక ప్రాంతాలలో కార్మికుల భద్రతకు శాశ్వత పరిష్కారం లభించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
