‘నాట్యోత్సవ 2026’ పేరిట తన నాట్యశాస్త్ర కౌశలాన్ని ప్రదర్శించి, మన్ననలను అందుకున్న విద్యార్థులు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని సంస్కృతి విద్యార్థి విభాగం గురువారం ప్రపంచ కూచిపూడి దినోత్సవాన్ని ‘నాట్యోత్సవ 2026’ పేరిట ఘనంగా జరుపుకుంది. పూజ్య గురువు, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం, కూచిపూడిలో ఆయన చిరస్థాయిగా నిలిపిన వారసత్వానికి నివాళులు అర్పించారు.
ప్రార్థనా గీతంతో ఆరంభమైన ఈ కార్యక్రమం మంగళంతో ముగిసింది. బ్రహ్మాంజలి, జతీస్వరం, మురుగ శబ్దం, భామాకలాపం, తరంగం వంటి సంప్రదాయ కూచిపూడి ప్రదర్శనల ద్వారా తొమ్మిది మంది విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. అభిగ్న మురుగ శబ్దం యొక్క భావ వ్యక్తీకరణ ప్రదర్శన, భామాకలాపంలో సత్యభామగా హర్ష పోషించిన అభినయం ప్రేక్షకుల నుంచి ఉత్సాహభరితమైన ప్రశంసలను అందుకుంది.

నాట్య నివేదన వ్యవస్థాపకుడు, ముఖ్య అతిథి గురువు చిరంజయ్ పొద్దార్ కూచిపూడిలో నైపుణ్యం సాధించడానికి అవసరమైన కఠిన శిక్షణ, అంకితభావాన్ని గుర్తుచేసుకున్నారు. తమ గురువు డాక్టర్ వెంపటి చిన సత్యం కళారూపానికి చేసిన అమూల్యమైన సహకారాన్ని బహుదా ప్రశంసిస్తూ, సంప్రదాయ కళలను నేర్చుకోవడానికి, సంరక్షించడానికి భక్తి అవసరమని ఉద్ఘాటించారు. ఈ వేడుకలలో విదుషి అంజు అరవింద్, విద్వాన్ ఆనందు మురళి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
