గీతంలో రఫ్ సెట్ సిద్ధాంతంపై కార్యశాల

Telangana

కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్ రంగాలలో అనిశ్చితిని పరిష్కరించడానికి సూచనలు

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధస్సు (ఏఐ), డేటా సైన్స్ (డీఎస్) రంగాలలో అనిశ్చితిని పరిష్కరించడానికి, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి విద్వత్ మార్పిడిని ప్రోత్సహిస్తూ, వినూత్న విధానాలను ప్రోత్సహించే అర్థవంతమైన ఒకరోజు కార్యశాలను గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ (జీఎస్ఎస్) మంగళవారం నిర్వహించింది. రఫ్ సెట్ సిద్ధాంత వ్యవస్థాపకుడైన ప్రముఖ గణిత, కంప్యూటర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జిడ్జిస్లావ్ పావ్లాక్ (1926-2006) జన్మ శతాబ్దిని పురస్కరించుకుని, జీఎస్ఎస్ లోని గణిత, గణాంక శాస్త్ర విభాగం ‘ఏఐ, డీఎస్ కోసం రఫ్ సెట్ సిద్ధాంతం’ శీర్షికన దీనిని ఏర్పాటు చేసింది.

అనిశ్చితిలో తార్కికత యొక్క గణిత పునాదులకు ప్రొఫెసర్ పావ్లాక్ చేసిన మార్గదర్శక కృషిని గౌరవించడం, సమకాలీన కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ లో రఫ్ సెట్ సిద్ధాంతం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ కార్యశాల ముఖ్య ఉద్దేశం.ఈ కార్యశాలలో హైదరాబాదు విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ మాజీ సీనియర్ ప్రొఫెసర్ సి.ఆర్. రావు; అదే విభాగానికి చెందిన ప్రొఫెసర్ సల్మాన్ అబ్దుల్ మోయిజ్; హైదరాబాదులోని ఎంజీఐటీ లోని సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.వి. రజనీకాంత్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వారు రఫ్ సెట్ సిద్ధాంతం యొక్క సైద్ధాంతిక పునాదులు, అభివృద్ధి చెందుతున్న అనువర్తనాలపై తమ జ్జానాన్ని, పరిశోధన అనుభవాలను, విలువైన అంతర్దృష్టులను సదస్యులతో పంచుకున్నారు.

సాంకేతిక సమావేశాలలో రఫ్ సెట్ సిద్ధాంతం యొక్క ప్రాథమిక భావనలు, గణిత పునాదులు, అట్రిబ్యూట్ రిడక్షన్, ఫీచర్ సెలక్షన్, రూల్ ఇండక్షన్, గ్రాన్యులర్ కంప్యూటింగ్, నాలెడ్జ్ డిస్కవరీ, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ కోసం హైబ్రిడ్ రఫ్ సెట్ మోడళ్ల యొక్క ప్రాథమిక భావనలు, గణిత పునాదులను ఈ కార్యక్రమంలో వివరించారు. ఈ చర్చలు, అభివృద్ధి చెందుతున్న పరిశోధన ధోరణులను, కృత్రిమ మేధస్సు, తెలివైన నిర్ణయాలు తీసుకోవడంలో రఫ్ సెట్ ఆధారిత విధానాల యొక్క సంభావ్య అనువర్తనాలను కూడా ప్రముఖంగా ప్రస్తావించారు.

వివిధ విభాగాలకు చెందిన అధ్యాపక సభ్యులు, పరిశోధకులు, పీజీ విద్యార్థులు ఈ కార్యశాలలో పాల్గొని, నిపుణులతో సంభాషించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమం భావనాత్మక అవగాహనను బలోపేతం చేయడానికి, తెలివైన డేటా విశ్లేషణలో ఆచరణాత్మక అనువర్తనాలను అన్వేషించడానికి, అంతర్ విషయ పరిశోధన, సహకారాన్ని పెంపొందించడానికి ఒక విలువైన వేదికను అందించింది.ఈ కార్యశాల ప్రారంభోత్సవానికి జీఎస్ఎస్ డైరెక్టర్ డాక్టర్ ఎం. రెజా అధ్యక్షత వహించారు. గణిత, గణాంక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జాదవ్ గణేష్ దీనిని నిర్వహించగా, డాక్టర్ డి. మల్లికార్జున రెడ్డి, డాక్టర్ నాయర్ రమ్య రవీంద్రన్ సమన్వయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *