నెల్లూరు,మనవార్తలు ప్రతినిధి :
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. సత్యం, అహింస, శాంతి, సహనం అనే విలువలను ఆయుధాలుగా చేసుకుని దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ సాగించిన పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.మహాత్మా గాంధీ తన జీవితం ద్వారా సత్యనిష్ఠ, నిరాడంబరత, క్రమశిక్షణ, సమాజ సేవ యొక్క గొప్పతనాన్ని చాటిచెప్పారని తెలిపారు. హింసకు తావులేకుండా, శాంతియుత మార్గంలో కూడా గొప్ప మార్పులను సాధించవచ్చని ప్రపంచానికి నిరూపించిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు.సమాజంలో సమానత్వం, సామరస్యం, ఐక్యతను పెంపొందించడంతో పాటు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం ద్వారా గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. నేటి యువత గాంధీజీ బోధించిన సత్యం, అహింస, దేశభక్తి, నైతిక విలువలను జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.మహాత్మా గాంధీ ఆశయాలు, ఆదర్శాలు భారతదేశానికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని, ఆయన చూపిన సత్యం, అహింస మార్గంలో పయనిస్తూ శాంతియుత, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆకాంక్షించారు.
