త్రివిధ దళాల సమన్వయంలో సీడీఎస్ కీలక భూమిక

Telangana

కె.ఎస్.పి.పి. ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న నితిన్ ఎ. గోఖలే

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

భారతదేశ రక్షణ రంగంలోని త్రివిధ దళాలను సమన్వయం చేయడంతో పాటు ప్రభుత్వానికి ఏకోన్ముఖంగా సైనిక సలహాలు ఇవ్వడం, దళాల నైపుణ్యాన్ని పెంపొందించడంలో త్రివిధ దళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ – సీడీఎస్) కీలక భూమిక పోషిస్తున్నారని భారత్ శక్తి గ్రూపు వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్ నితిన్ ఎ. గోఖలే అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కె.ఎస్.పి.పి)లో ‘రేపటి యుద్ధాలకు సన్నద్ధం: త్రివిధ దళాల నుంచి ఒకే పోరాట శక్తిగా’ అనే అంశంపై శుక్రవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.

గోఖలే భారతదేశ ఉన్నత రక్షణ వ్యవస్థ పరిణామక్రమాన్ని వివరిస్తూ, లార్డ్ ఇస్మే ప్రతిపాదించిన మూడు అంచెల నిర్మాణం, జాతీయ భద్రతా దళం (ఎన్.ఎస్.జీ) ఏర్పాటు గురించి చర్చించారు. కార్గిల్ సమీక్షా కమిటీ సిఫార్సులు, సీడీఎస్ ఏర్పాటుకు సంబంధించి 2019 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో సహా రక్షణ సంస్కరణలలోని కీలక మైలురాళ్లను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. 2020 జనవరి 1న భారతదేశపు మొట్టమొదటి సీడీఎస్ నియామకం, సైనిక వ్యవహారాల శాఖ (డీఎంఏ) ఏర్పాటు గురించిన వివరాలను కూడా తెలియజేశారు.సీడీఎస్ పాత్ర గురించి, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (సీఓఎస్సీ) అధ్యక్షునిగా, డీఎంఏ కార్యదర్శిగా, త్రివిధ దళాల అధిపతిగా సీడీఎస్ బాధ్యతలను గోఖలే వివరించారు. ఈ సంస్థాగత మార్పులు, సాయుధ దళాల మధ్య త్రివిధ దళాల ఏకీకరణ (థియేటరైజేషన్), అధిక కార్యాచరణ సమన్వయానికి పునాది వేశాయని ఆయన పేర్కొన్నారు.

ఈ ఉపన్యాసం రక్షణ పరివర్తనలోని కీలక రంగాలను పరిశీలించింది. వాటిలో పోరాట సామర్థ్యాన్ని పెంచడం, మానవశక్తి, వనరులను ఉత్తమంగా వినియోగించుకోవడం, ఆధునీకరణ, స్వదేశీకరణ, మానవ వనరుల సంస్కరణలు, సాయుధ దళాలలో మహిళల భాగస్వామ్యం, వలసవాద వారసత్వాలను పరిష్కరించడం, జాతీయ భద్రతా ప్రయత్నాలను బలోపేతం చేయడం వంటి ఉన్నాయి. త్రివిధ దళాల ప్రధాన కార్యాలయాలలో తేడాలు, కార్యాచరణ అవసరాలు, సైనిక, పౌర పరిపాలనా నిర్మాణాల సమన్వయం వంటి ఏకీకరణకు ఎదురయ్యే ఆచరణాత్మక, సంస్థాగత సవాళ్లను కూడా గోఖలే ప్రస్తావించారు.త్రివిధ దళాలు ఏకోన్ముఖంగా ముందుకెళ్లే మార్గాన్ని గోఖలే వివరిస్తూ, సమీకృత థియేటర్ కమాండ్లను స్థాపించడం, వాయు రక్షణ, సంయుక్త కమాండ్ నిర్మాణాలను ఏకీకృతం చేసి కార్యాచరణలోకి తీసుకురావడం, 2047 నాటికి సాయుధ దళాల కోసం ఒక దీర్ఘకాలిక దార్శనికతను అభివృద్ధి చేయడం, సంయుక్త సిద్ధాంతాలను రూపొందించడం, త్రివిధ దళాలకు ఆదేశాలు, సూచనలు జారీ చేయడం, సంబంధిత ఏజెన్సీలను విస్తరించడం వంటి వాటి ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.

భారతదేశ ఉన్నత రక్షణ సంస్థపై ఆపరేషన్ సింధూర్ ప్రభావాలను, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ యొక్క కేంద్రీకృత పాత్రను గోఖలే విశదీకరించారు. సీడీఎస్ వ్యవస్థలోని లోటుపాట్లను విశ్లేషిస్తూ, డొమైన్ నైపుణ్యం, ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియలో భాగస్వామ్యాన్ని కీలక బలాలుగా ఆయన గుర్తించారు. నేర్చుకోవలసిన విషయాలు, సంస్థాగత పక్షపాతాలు, పరిపాలనా పనిభారం వంటివి బలహీనతలుగా విశ్లేషించారు. విధాన నిర్ణయాలలో మరింత సన్నిహిత భాగస్వామ్యం, తక్కువ సమయం వల్ల తలెత్తే అవకాశాలలతో పాటు, వివిధ సేవల మధ్య సమన్వయం, సంస్థాగత సహకారాన్ని బలోపేతం ఆవశ్యకతను ఆయన ప్రస్తావించారు.ఉపన్యాసం ముగిశాక నిర్వహించిన ముఖాముఖిలో గోఖలే, విధాన రంగ నిపుణులుగా ఎదగాలనుకుంటున్న ఔత్సాహిక విద్యార్థులతో సంభాషించి, వారి ప్రశ్నలకు ఓపికగా సమాధానమిచ్చారు. కె.ఎస్.పి.పి. డీన్, ఐక్యరాజ్య సమితిలో భారతదేశ మాజీ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ కూడా ఈ ఉపన్యాస కార్యక్రమానికి హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *