మూడు రోజుల కార్యక్రమంలో సంస్థాగత సవాళ్ల పరిష్కారానికి శిక్షణ
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ (జీఎస్బీ) లోని వ్యాపార భాగస్వామ్య కేంద్రం (సీబీఈ) ఆధ్వర్యంలో ‘సంస్థాగత ఆవిష్కరణ కోసం డిజైన్ థింకింగ్: భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సంస్థల కోసం మానవ-కేంద్రీకృత సమస్య పరిష్కారం’ పేరిట మూడు రోజుల యాజమాన్య వికాస కార్యక్రమం (ఎండీపీ)ని నవంబరు 26 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ కార్యక్రమం, డిజైన్ థింకింగ్ లోని ఐదు దశలైన- సహానుభూతి (ఎంపథైజ్), నిర్వచించడం (డిఫైన్), ఆలోచనలు చేయడం (ఐడియేట్), నమూనా తయారు చేయడం (ప్రోటోటైఫ్), పరీక్షించడం (టెస్ట్) ద్వారా సంస్థాగత సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైన మానవ-కేంద్రీకృత విధానంతో ఇందులో పాల్గొనేవారిని సన్నద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. ఇందులో సహానుభూతి మ్యాపింగ్, కస్టమర్ జర్నీ మ్యాపింగ్, సమస్యను గుర్తించడం, పున:రూపకల్పన చేయడం, సృజనాత్మక ఆలోచనలు చేయడం, వేగవంతమైన నమూనా తయారీ, వినియోగదారు పరీక్ష, ఆవిష్కరణ సంస్కృతి, అంతర్గత వ్యవస్థాపకత వంటి కీలక అంశాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాప్ స్టోన్ టీమ్ ఛాలెంజ్, ఆచరణాత్మక కార్యాలయ అనువర్తనాలు కూడా ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమం ముగిసేనాటికి, ఇందులో పాల్గొనేవారు డిజైన్ థింకింగ్ ను ఉపయోగించి సంస్థాగత సవాళ్లను పరిష్కరించడం, వినియోగదారు, వాటాదారుల అవసరాలను అర్థం చేసుకోవడం, వినూత్నమైన, ఆచరణాత్మక పరిష్కారాలను రూపొందించడం, నమూనాలను అభివృద్ధి చేసి పరీక్షించడం, వివిధ విభాగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, సంస్థాగత ఆవిష్కరణ, మార్పును ప్రోత్సహించడం, తమ సంస్థల కోసం ఆచరణీయమైన ఆవిష్కరణ ప్రణాళికలను రూపొందించడం వంటివి చేయగలుగుతారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ లోని ఎంటర్ ప్రెన్యూర్ షిప్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, ఏరియా చైర్ డాక్టర్ సుభేందు కుమార్ మిశ్రా, ఆర్గనైజేషనల్ డెవలప్ మెంట్ అండ్ హెచ్ఆర్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తపస్ బంథా సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని తెలియజేశారు.ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు తమ పేర్ల నమోదు, రుసుము వంటి వివరాల కోసం 96500 89575ను సంప్రదించాలని లేదా cbe@gitam.eduకు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.
