సుదూర వాణిజ్యంలో గుజరాత్ ది కీలక భూమిక

Telangana

చారిత్రక ఆధారాలతో సహా వివరించిన హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సుచంద్ర ఘోష్

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

చారిత్రక కాలం నుంచి సుదూర వాణిజ్య నెట్ వర్కులలో గుజరాత్ కీలక భూమిక పోషిస్తోందని, ముఖ్యంగా భరుకచ్చ (బారిగజా), అనహిలపుర (అనహిలపట్టణం), సోమనాథలను ఉటంకిస్తూ, చారిత్రక ఆధారాలతో సహా హైదరాబాద్ విశ్వవిద్యాలయం, చరిత్ర విభాగం ప్రొఫెసర్ సుచంద్ర ఘోష్ వివరించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని ఆసియా అధ్యయన కేంద్రం (సీఏఎస్) ఆధ్వర్యంలోని పట్టణీకరణ, లింగం, కార్మిక (యూజీఎల్) సంభాషణల ఉపన్యాస శ్రేణిలో భాగంగా, ‘తొలినాళ్లలో గుజరాత్ లోని ఓడరేవు, అంతర్గత పట్టణ కేంద్రాల మధ్య వాణిజ్య నెట్ వర్కుల అమరిక: రెండు నగరాల వాణిజ్య స్వరూపాలను విశ్లేషించడం’ అనే అంశంపై బుధవారం ఆమె ఉపన్యసించారు.

పెరిప్లస్ మారిస్ ఎరిథ్రాయీ, టోలెమీ రచనలు, జాతక సాహిత్యం, శాసనాలు, కైరో జెనిజా పత్రాలతో సహా సాహిత్య, శాసన, పురావస్తు ఆధారాలను ఉటంకిస్తూ, ప్రొఫెసర్ సుచంద్ర ఘోస్ తన ఉపన్యాసాన్ని కొనసాగించారు. గుజరాత్ దక్కన్, ఉత్తర భారతదేశం, ఎర్ర సముద్రం, పశ్చిమాసియా, విస్తృత హిందూ మహాసముద్ర ప్రపంచంతో అనుసంధానించే విస్తృతమైన సముద్ర, భూమార్గ నెట్ వర్కులను ఘోష్ వివరించారు. పశ్చిమ భారతదేశంలోని ఒక ప్రధాన ఓడరేవుగా భరుకచ్చా ప్రాముఖ్యతను, తీరప్రాంత, అంతర్-ప్రాంతీయ మార్గాలతో అనుసంధానించిన ఒక ముఖ్యమైన అంతర్గత వాణిజ్య కేంద్రంగా అనాహిలాపుర ఆవిర్భావాన్ని ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు.

వ్యాపారులు, సరుకులు, ఆలోచనల కదలికలను ఈ ఉపన్యాసం అన్వేషించింది. ఓడరేవు నగరాలు, అంతర్గత పట్టణ కేంద్రాలు విస్తృత వాణిజ్య పరిసరాలలో పరస్పరం అనుసంధానించిన కేంద్రాలుగా ఎలా పనిచేశాయో వివరించింది. హిందూ మహాసముద్ర వాణిజ్యం, పట్టణీకరణ యొక్క చారిత్రక అభివృద్ధిలో గుజరాత్ ముఖ్యమైన స్థానాన్ని ఈ చర్చ నిర్ధరించింది.ఈ సమావేశానికి డాక్టర్ ఎం.వి.శ్రీకాంత, డాక్టర్ శ్రీజిత బసక్ అధ్యక్షత వహించగా, డాక్టర్ దేబద్రిత చక్రవర్తి నిర్వహిం చారు. ఈ ఉపన్యాసం గుజరాత్ లో వాణిజ్యం, పట్టణాభివృద్ధి, వాణిజ్య నెట్ వర్కుల పరిణామ క్రమాన్ని విశదీకరించింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *