అధునాతన పరిశోధన, వర్ధమాన సాంకేతికతలపై ప్రత్యక్ష అవగాహన
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
అధునాతన పరిశోధన, వర్ధమాన సాంకేతికతలపై ప్రత్యక్ష అవగాహనకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని 33 మంది విద్యార్థులు, నలుగురు అధ్యాపకులతో కలిసి గురువారం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాదు (ఐఐటీహెచ్)ని సందర్శించారు. గీతం మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా, వారు ఐఐటీలోని మెకానికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాల పనితీరును పరిశీలించారు.
శాస్త్రీయ, ఇంజనీరింగ్ ఆవిష్కరణపై విద్యార్థుల అవగాహనను విస్తృతం చేయడంతో పాటు (STEM) విద్య, పరిశోధనలలో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ సందర్శన ముఖ్య లక్ష్యం. రోబోటిక్స్ ప్రయోగశాల, సాఫ్ట్ మ్యాటర్, మైక్రోస్విమ్మర్స్ ప్రయోగశాల, ఇన్నోవేషన్ హబ్, కాంక్రీట్ ప్రయోగశాల, విండ్ టన్నెల్ ప్రయోగశాల వంటి ఐదు కేంద్రాలను గీతం విద్యార్థుల బృందం సందర్శించింది.
ఈ ప్రయోగశాలలు విద్యార్థులకు స్వయం ప్రతిపత్తి (అటానమస్) రోబోట్లు, డ్రోన్లు, నీటి అడుగున తనిఖీ వ్యవస్థలు, కృత్రిమ మైక్రోస్విమ్మర్లు, రాపిడ్ ప్రోటోటైపింగ్, త్రీడీ ప్రింటింగ్, అధునాతన కాంక్రీట్ సాంకేతికతలు, విండ్ టన్నెల్ పరీక్షలతో సహా అనేకరకాల అనువర్తనాలను పరిచయం చేశాయి. ఈ అనుభవాలు అత్యాధునిక పరిశోధనలు, విభిన్న ఇంజనీరింగ్ విభాగాలలో వాటి ఆచరణాత్మక అనువర్తనాలపై విలువైన అవగాహనను అందించాయి.
ఈ సందర్శన తరగతి గదికి అతీతంగా ఒక సుసంపన్నమైన అభ్యాస అనుభవాన్ని అందించింది. ఇది శాస్త్రీయ జిజ్జాస, ఆవిష్కరణ, పరిశోధన-ఆధారిత ఆలోచనా విధానాన్ని పెంపొందించింది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా, గీతం విశ్వవిద్యాలయంలోని మహిళా సాధికారత విభాగం ఉన్నత విద్య, శాస్త్రం, సాంకేతికత, అంతర్ విభాగ పరిశోధనలలో అవకాశాలను అన్వేషించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. ఈ సందర్శనలో అధ్యాపకులు డాక్టర్ కె. మల్లేశ్వరి, టి.రాజ్ ప్రియాంక, డాక్టర్ జ్యోతి రశ్మి నాయక్, డాక్టర్ సౌపర్ణి పాల్ పాల్గొన్నారు.
