గీతం ఆతిథ్య ఉపన్యాసంలో శాస్త్రవేత్త డాక్టర్ బిపిన్ కుమార్ గుప్తా
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
ప్రాథమిక పరిశోధనను ప్రజోపయోగంగా మార్చాలిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయాలని న్యూఢిల్లీలోని సీఐఎస్ఆర్-జాతీయ భౌతిక శాస్త్ర ప్రయోగశాల శాస్త్రవేత్త డాక్టర్ బిపిన్ కుమార్ గుప్తా అన్నారు. శాస్త్రీయ జిజ్జాసను పెంపొందించుకోవాలని, లక్ష్యాలను పట్టుదలతో సాధించాలని, భారతదేశ సాంకేతిక స్వావలంబనను బలోపేతం చేయగల స్వదేశీ సాంకేతికతల అభివృద్ధికి దోహదపడాలని విద్యార్థులను ప్రోత్సహించారు. హైదరా బాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఆత్మనిర్భర్ భారత్ కోసం కొత్తగా అభివృద్ధి చెందుతున్న నానో/క్వాంటం పదార్థాల రూపకల్పన, ఆవిష్కరణ, స్వదేశీ సాంకేతిక పరిజ్జాన అభివృద్ధి అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.సెమీకండర్టర్, క్వాంటం సాంకేతికతల కేంద్రం సహకారంతో, స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఈఈసీఈ విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. డాక్టర్ గుప్తా విద్యార్థులకు నానోపదార్థాలు, అభివృద్ధి చెందుతున్న టుడీ (ద్విమితీయ) పదార్థాలు, క్వాంటం పదార్థాలను ప్రాథమికంగా పరిచయం చేస్తూ, వాటి పరిమాణంపై ఆధారపడిన లక్షణాలు, సంభావ్య అనువర్తనాలను వివరించారు. క్వాంటం పదార్థాల పరిశోధన పరిణామ క్రమాన్ని ఆయన వివరిస్తూ, నానో/క్వాంటం సాంకేతికతలలోని పురోగతులు ఆరోగ్య సంరక్షణ, బయోమెడికల్ ఇమేజింగ్, ఫార్మాస్యూటికల్స్, కమ్యూనికేషన్స్, ప్రజాభద్రత, నకిలీ నిరోధక సాంకేతికతలకు ఎలా దోహదపడతాయో వివరించారు.స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్ వడ్డి, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ప్రశాంతరెడ్డి ముడిమాల, అతిథికి స్వాగతం పలికి, విద్యార్థులకు ఆయనను పరిచయం చేసి, సత్కరించారు. ఈఈసీఈ విభాగానికి చెందిన డాక్టర్ శాంతను సాహా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
