డేటా సైన్స్ ఆచరణాత్మక శిక్షణపై రెండు రోజుల కార్యశాల ప్రారంభం
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం, డేటా సైన్స్ ఆచరణాత్మకంగా వినియోగించడంపై దృష్టి సారించి, విద్యార్థులకు పరిశ్రమ-ఆధారిత అభ్యాస అనుభవాన్ని అందించేందుకు గాను ‘డేటా సైన్స్: ఆచరణాత్మక శిక్షణ’ పేరిట రెండు రోజుల కార్యశాలకు గురువారం శ్రీకారం చుట్టింది.డేటా సైన్స్ సాధనాలు, డేటా విశ్లేషణ, ప్రీప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్, టాబ్లో ఉపయోగించి డేటా విజువలైజేషన్, వాస్తవ ప్రపంచ కేస్ స్టడీస్, పరిశ్రమ అనువర్తనాలపై ఆచరణాత్మక అనుభవాన్ని అందించడం ద్వారా, విద్యాపరమైన అభ్యాసానికి, పరిశ్రమ పద్ధతులకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేలా ఈ కార్యశాలను రూపొందించారు.హబ్ల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, వ్యవస్థాపకుడు, ఏజిస్ సాఫ్ట్ టెక్ యొక్క టెక్ లీడ్, టాబ్లో రాయబారి దేవాంశు తాయల్ ప్రధాన శిక్షకుడిగా వ్యవహరించి, ఆచరణాత్మక సెషన్లు, పరిశ్రమ-కేంద్రీకృత అంతర్దృష్టుల ద్వారా విద్యార్థులను నిమగ్నం చేశారు. బి.టెక్. మూడవ, నాల్గవ ఏడాది, ఎం.టెక్. విద్యార్థులు ఈ కార్యశాలలో చురుకుగా పాల్గొంటూ, డేటాను అర్థవంతమైన అంతర్దృష్టులుగా, ప్రభావంగా మారుస్తూ, నేర్చుకోవడానికి, అన్వేషించడానికి, విశ్లేషించడానికి, దృశ్యమానం చేయడానికి, ఆవిష్కరించడానికి ఒక అవకాశాన్ని పొందారు.సీఎస్ఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ మహబూబ్ షేక్ బాషా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించారు. కార్యక్రమ నిర్వాహకురాలు ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్, ప్రధాన శిక్షకుడిని ఆహ్వానించి, విద్యార్థులకు పరిచయం చేశారు. జ్యోతి బంకపల్లి, డాక్టర్ యు. శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నారు.
