12 గంటల్లో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన అమీన్‌పూర్ పోలీసులు

Crime Telangana

కిడ్నాప్‌కు గురైన రెండున్నరేళ్ల చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు

అమీన్‌పూర్, మనవార్తలు ప్రతినిధి:

అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండున్నరేళ్ల చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు కేవలం 12 గంటల్లోనే ఛేదించి చిన్నారిని సురక్షితంగా రక్షించారు.
ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అమీన్‌పూర్‌లో నివాసముంటున్న ఎరుకల సరిత (25) సమీపంలోని టిఫిన్ సెంటర్‌కు పనికి వెళ్లగా, ఇంట్లో ఉన్న ఆమె రెండున్నరేళ్ల కుమార్తె అక్షిత కనిపించకుండా పోయింది. దీంతో బాధితురాలు మధ్యాహ్నం 1.30 గంటలకు అమీన్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అమీన్‌పూర్, చందానగర్, పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ల సిబ్బంది, ఎస్‌ఓటీ బృందాలతో కలిపి 25 మంది పోలీసులతో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఓ మహిళ చిన్నారిని అపహరించినట్లు గుర్తించి, ఆమె మెదక్ జిల్లాకు చెందినదిగా నిర్ధారించారు.మెదక్ టౌన్ పోలీసుల సహకారంతో నర్సిఖేడ్ గ్రామంలో నిందితురాలు గంగామణి (44), వృత్తి: పనిమనిషిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె చెరలో ఉన్న చిన్నారి అక్షితను సురక్షితంగా రక్షించి అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.
స్థానిక పోలీసులతో పాటు ఎస్‌ఓటీ బృందాలు సమన్వయంతో పనిచేసి కేవలం 12 గంటల్లోనే కేసును ఛేదించాయి. ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన అమీన్‌పూర్, చందానగర్, పటాన్‌చెరు పోలీస్ సిబ్బంది, ఎస్‌ఓటీ బృందాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *