పటాన్‌చెరు వేదికగా ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో సరికొత్త అధ్యాయం..

politics Telangana

డిసెంబర్ 12న అత్యంత వైభవంగా అద్వైత సంగమం

25 వేల నుంచి 40 వేల మంది అయ్యప్ప స్వాములతో అయ్యప్ప మహా మంత్ర కోటి నామార్చన

వేలాది మంది మహిళలతో కోటి కుంకుమార్చన మహోత్సవం..

శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి దివ్య సాన్నిధ్యం..

పందళం రాజవంశీయులు, శంకరాచార్య సంప్రదాయానికి చెందిన ప్రముఖుల రాక..

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో మహా ఆధ్యాత్మిక వేడుక..

కలడి శ్రీ ఆది శంకర మఠం ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు..

రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం..

వెల్లడించిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కలడి శ్రీ ఆది శంకర మఠం ఫౌండర్ ట్రస్టీ ఉన్ని కృష్ణన్..

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

మినీ ఇండియాగా పేరొందిన పటాన్‌చెరు పట్టణం మరో చారిత్రాత్మక ఆధ్యాత్మిక మహోత్సవానికి వేదికగా నిలవబోతోంది. సనాతన ధర్మ వైభవాన్ని, అద్వైత వేదాంత తత్వాన్ని, అయ్యప్ప స్వామి భక్తి పరిమళాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో డిసెంబర్ 12వ తేదీన పటాన్‌చెరులోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్ గ్రౌండ్స్ వేదికగా అత్యంత వైభవంగా ‘అద్వైత సంగమం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహాయ సహకారాలతో, కలడి శ్రీ ఆది శంకర మఠం ఆధ్వర్యంలో ఈ అపూర్వ ఆధ్యాత్మిక వేడుకకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 25 వేల నుంచి 40 వేల మంది అయ్యప్ప స్వాములు ఒకే వేదికపై కొలువుదీరి, ఏకకాలంలో కోటి 8 లక్షల సార్లు అయ్యప్ప మహా మంత్రాన్ని జపించనుండటం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అంతేకాకుండా వేలాది మంది మహిళలతో సామూహిక కుంకుమార్చన నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కలడి శ్రీ ఆది శంకర మఠం ఫౌండర్ ట్రస్టీ ఉన్నికృష్ణన్, బీహెచ్ఈఎల్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ సంయుక్తంగా వెల్లడించారు.

ప్రపంచానికి సనాతన ధర్మం గొప్పతనాన్ని, అయ్యప్ప ధర్మంలోని ఆధ్యాత్మిక విశిష్టతను ఒకే వేదికపై పరిచయం చేయాలనే సంకల్పంతో అద్వైత సంగమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఆచారం, ప్రచారం, పరివర్తన అనే ప్రధాన లక్ష్యాలతో కార్యక్రమాలను రూపొందించినట్లు వివరించారు.అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన జగద్గురు ఆదిశంకరాచార్యుల సంప్రదాయానికి చెందిన శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి దివ్య సాన్నిధ్యంలో డిసెంబర్ 12వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఈ మహోత్సవంలో భాగంగా 25 వేల నుంచి 40 వేల మంది అయ్యప్ప స్వాములతో సామూహిక అయ్యప్ప స్వామి పూజ, అద్వైత సభ, అయ్యప్ప స్వామి కోటి నామార్చన, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదేవిధంగా వేలాది మంది మహిళల భాగస్వామ్యంతో శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి చేతుల మీదుగా సౌందర్యలహరి, కనకధారా స్తోత్ర పారాయణంతో అమ్మవారికి కోటి కుంకుమార్చన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం విజయోత్సవం, మంగళహారతి, హరివరాసనంతో కార్యక్రమాలను సంపూర్ణంగా ముగించనున్నారు.

రిజిస్ట్రేషన్ తప్పనిసరి

ఈ చారిత్రాత్మక ఆధ్యాత్మిక మహోత్సవంలో పాల్గొనదలచిన అయ్యప్ప స్వాములు, మహిళలు ముందస్తుగా తమ పేర్లు, వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా అనుమతి పొందిన వారికి మాత్రమే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమానికి పందల రాజ వంశీయులతో పాటు శ్రీ ఆది శంకరాచార్యుల వంశానికి చెందిన కుటుంబ సభ్యులు హాజరు కాబోతున్నట్టు తెలిపారు.ఈ మహా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేసే లక్ష్యంతో సంస్థ ప్రతినిధులు సైతం హాజరుకానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.పటాన్‌చెరు వేదికగా నిర్వహించనున్న ఈ అపూర్వ అద్వైత సంగమం సనాతన ధర్మ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే మహత్తర ఘట్టంగా నిలవనుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. భక్తులు, మహిళలు, ఆధ్యాత్మికవేత్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వాములై ఈ మహా ఆధ్యాత్మిక వేడుకను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *