పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి:
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తట్టేడు మట్టి తీయలేదని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని శివనగర్ నుంచి పెద్ద కంజర్ల వరకు రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 3 యేండ్లు గడుస్తున్నా పటాన్చెరు నియోజకవర్గంలో కనీసం ఒక్క అభివృద్ధి పనైనా జరగలేదని, కనీసం “తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించి మోసం చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు.
అధ్వానంగా మారిన రోడ్ల వల్ల స్థానికులు, పాఠశాల విద్యార్థులు పడుతున్న నరకయాతన ప్రభుత్వాలకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్కు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. తక్షణమే శివనగర్ – పెద్ద కంజర్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, లేనిపక్షంలో ప్రజలను సమీకరించి ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిన్నారం మున్సిపాలిటీ అధ్యక్షులు జగన్ రెడ్డి, జిన్నారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
