నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు..
25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం..
జిల్లా అదనపు కలెక్టర్ పాండు, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి..
ప్రభుత్వ విద్య వ్యవస్థ బలోపేతానికి ప్రథమ ప్రాధాన్యత..
ఎడ్యుకేషనల్ హబ్ గా పటాన్ చెరు
భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులది
మత్తు పదార్థాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రభుత్వ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు
100 మంది ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులని, భావి భారత పౌరులను తయారు చేయాల్సిన గురుతర బాధ్యత వారిపై ఉందని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ పాండు అన్నారు. గత 25 సంవత్సరాలుగా ప్రతి ఏటా గురు పూజోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి అభినందనలు తెలిపారు.పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి ప్రభుత్వ పాఠశాల గురుపూజోత్సవ వేడుకలకు అదనపు కలెక్టర్ పాండు, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న 100 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో ఒక విద్యార్థి ఉత్తమ పౌరుడుగా ఎదగడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు ఉత్తమ భవిష్యత్తును అందిస్తారని అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులను ఉత్తమ బోధన చేస్తున్న ఉపాధ్యాయులను సన్మానించడం పట్ల ఎమ్మెల్యే జిఎంఆర్ ను ప్రశంసించారు. పటాన్ చెరు నియోజకవర్గంలో ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాత్ర అభినందనీయమని అన్నారు.

జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రతి విద్యార్థిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుని వెళుతున్నామని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహిస్తూ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించడం పట్ల అభినందనలు తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎటువంటి సమస్యలు ఉన్న స్వయంగా తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముందుంటారని కితాబుని ఇచ్చారు. ప్రతి సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సైతం ప్రోత్సాహకాలు అందించడం పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మత్తు పదార్థాల వినియోగం ఒక జటిల సమస్యగా మారిందని అన్నారు. పాఠశాల స్థాయి నుండి మత్తుమదార్థాలు వాడకం వల్ల కలిగే అనార్థాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను కోరారు. మినీ ఇండియాగా పేరుందిన పటాన్ చెరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక శాతం పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉచితంగా విద్యను అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు.కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల భవనాలు తీర్చిదిద్దుతూ మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు..ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్య మూలంగా అడ్మిషన్లు సైతం దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.
గత 25 సంవత్సరాలుగా ప్రతి ఏటా గురుపూజోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసి, ఉత్తమ గురువులను సన్మానించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. అనంతరం పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న 100 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూగత 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేతృతంలో ప్రతి సంవత్సరం గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఆయా పాఠశాలల విద్యార్థిని విద్యార్థులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. గురువులకు పాదాభివందనం పేరుతో తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమానికి మంత్రముగ్ధులైన ఎమ్మెల్యే జిఎంఆర్ స్వయంగా 26వేల రూపాయల నగదు బహుమతి అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
