నవ సమాజ నిర్దేశకులు గురువులు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

పటాన్ చెరులో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు

200 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం

25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

ఒక దేశ భవిష్యత్తు నిర్మాణం తరగతి గదిలోనే జరుగుతుందని ప్రతి విద్యార్థిని భావిభారత పౌరుడుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గత 25 సంవత్సరాలుగా గురుపూజోత్సవం పురస్కరించుకొని నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను ప్రతి ఏటా సన్మానించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

బుధవారం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో పటాన్ చెరు నియోజకవర్గస్థాయి ప్రైవేటు పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని ప్రైవేటు పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులగా ఎంపికైన 200 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులని కొనియాడారు.

విద్యార్థులకు చదువుతోపాటు నైతిక విలువలు, కుటుంబ బంధాలు, సమాజంలో వస్తున్న మార్పులను తెలియజేస్తూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో అధిక శాతం పేద, మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలల ద్వారా పోటీ ఏర్పడుతున్నప్పటికీ ప్రైవేటు పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయని అభినందించారు.

ప్రతి రంగంలో పటాన్ చెరు నియోజకవర్గానికి వన్నెతెచ్చేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.. ప్రభుత్వ ప్రైవేటు తేడా లేకుండా గత 24 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహిస్తూ ఉపాధ్యాయులను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంలో మొబైల్ వాడకం అత్యంత ప్రమాదకరంగా మారిందని తెలిపారు. టెక్నాలజీని మనిషి ఎదుగుదలకు ఉపయోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని అదే టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే సమాజానికి ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతి ఉపాధ్యాయుడు తన తరగతి గదిలోని ప్రతి విద్యార్థి చదువుతోపాటు మానసిక ప్రవర్తన పై ఎప్పటికప్పుడు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రైవేట్ పాఠశాలల సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *