పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి:
క్రీడలు యువతలో క్రమశిక్షణతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు . సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూర్ గ్రామంలోని స్నేహ ఫంక్షన్ హాల్లో ‘పవర్ డ్రాగన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఇండియా’ ఆధ్వర్యంలో, సంగారెడ్డి చైర్మన్ గోపాల్ యాదవ్ సారథ్యంలో నిర్వహించిన ‘రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాటా శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం హాజరై పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో చిన్నారులు సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోకుండా మైదానంలోకి వచ్చి ఆడుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
క్రీడలు కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా, చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టుగా కలిసి పనిచేసే నైపుణ్యాలను పెంపొందిస్తాయని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 700 మంది విద్యార్థులు ఈ ఛాంపియన్షిప్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవడం అభినందనీయమన్నారు. కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ సాధన వల్ల శరీరంలో కండరాలు బలపడటమే కాకుండా, స్టామినా, శారీరక సమతుల్యత మెరుగుపడతాయని తెలిపారు.
ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఆడపిల్లలు తమను తాము రక్షించుకునే ధైర్యం, మెలుకువలు అలవడతాయని చెప్పారు. గురువులను గౌరవించడం, నియమాలను పాటించడం నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో చదువు పట్ల ఏకాగ్రత కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. క్రీడాకారులు భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాములు యాదవ్, కురుమ సంఘం మండల అధ్యక్షుడు శంకర్ యాదవ్, మాజీ ఉపసర్పంచ్ రజనీకాంత్, దర్గా శ్రీనివాస్, నారాపురెడ్డి,నర్సింగ్ రావు, శ్రీకాంత్ రెడ్డి, యాదయ్య, యాదగిరి,తదితరులు పాల్గొన్నారు
