సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా నవారి శ్రీనివాసరెడ్డి సేవా కార్యక్రమం

politics Telangana

అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం

రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాంత్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో బీహెచ్ఈఎల్ నుంచి శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యాత్రలో భాగంగా 14వ రోజు సందర్భంగా అనంతపురం సమీపంలోని పాలసముద్రంలో తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నవారి శ్రీనివాసరెడ్డి భక్తులకు భోజన వసతులు కల్పించారు.ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ శబరిమలై యాత్రలో భాగంగా ప్రయాణిస్తున్న తమకు మార్గమధ్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. యాత్రలో భక్తులకు ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించడం గొప్ప సేవాభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్న దాతలకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.నవారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. అయ్యప్ప స్వాముల సేవ చేయడం తనకు లభించిన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. శబరిమలై యాత్రలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సాయినాథ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మధు ప్రకాష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలోని అయ్యప్ప స్వాములు, ఇతర భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *