మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో గురువారం ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం, జాతీయ ఫార్మసీ వారోత్సవాలు-2026ను ఘనంగా జరుపుకున్నారు. సూక్మజీవి నాశిని నిరోధకత (ఏఎంఆర్) అవగాహనా కార్యక్రమంలో భాగంగా, ‘యాంటీమైక్రోబయల్ నిరోధకతను ఎదుర్కోవడం’ అనే ఇతివృత్తంతో వీటిని నిర్వహించారు.ఇందులో భాగంగా, ఫార్మా క్విజ్, సైంటిఫిక్ పోస్టర్ ప్రజెంటేషన్ (శాస్త్రీయ గోడపత్రికల రూపకల్పన), డిజిటల్ రీల్స్ మేకింగ్, నుక్కడ్ నాటక్ (అవగాహన వీథి నాటకం), సైటూన్స్ (సైన్స్ కార్టూన్లు), కరపత్రాల రూపకల్పన వంటి పలు ఆసక్తికరమైన కార్యక్రమాలు నిర్వహించారు. వర్ధమాన ఫార్మసిస్టులకు వారి సృజనాత్మకత, శాస్త్రీయ పరిజ్జానం, భావప్రసార నైపుణ్యాలు, బృంద స్ఫూర్తిని ప్రదర్శించే అవకాశాలను ఈ పోటీలు కల్పించాయి.సృజనాత్మకతతో, చురుకుగా పాల్గొన్న ప్రతిభావంతులైన విద్యార్థుల ఉత్సాహం, నూతనత్వం, అర్థవంతమైన కృషిని ఫార్మసీ స్కూల్ యాజమాన్యం గుర్తించింది. వారి అంకితభావం, అద్భుతమైన భాగస్వామ్యాన్ని ప్రశంసిస్తూ, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ చేతుల మీదుగా వారికి ప్రశంసా పత్రాలు, చిరస్మరణీయమైన బహుమతులను అందజేసి, సత్కరించారు.ఎంతో ఉపయుక్తంగా, అర్థవంతంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం పట్ల ఇందులో పాల్గొన్న విద్యార్థులు హర్షాన్ని వెలిబుచ్చారు. ఈ కార్యక్రమాలు తమ సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, వృత్తిపరమైన నైపుణ్యాలు, యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అనే క్లిష్టమైన సవాలుపై అవగాహనను పెంచాయని వారు అభిప్రాయపడ్డారు.
