పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి:
పటాన్చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని యండిఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో చెరుకు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యండిఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసి ఛట్ పూజ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ పటాన్చెరు ప్రాంతంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారని, భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు చెందిన వారంతా పరస్పర గౌరవం, సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తున్నారని అన్నారు. వివిధ పండుగలు ప్రజల మధ్య ఐక్యత, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.గత మూడు సంవత్సరాలుగా ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం సంతోషంగా ఉందని తెలిపారు.యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమాజంలోని అన్ని వర్గాలకు ఉపయోగపడే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఉత్తర భారతీయులందరికీ ఛట్ పూజ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సూర్యభగవానుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శ్రేయస్సు కలగాలని పృథ్వీరాజ్ ఆకాంక్షించారు.
