ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనది పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana
  • ఎస్ఐఆర్‌లో పాల్గొనండి.. పటాన్‌చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి
  • ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతి ఓటు ప్రాణాధారమని, ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే అర్హులైన ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొని, ఆగస్టు 3వ తేదీ లోపు తమ దరఖాస్తులను పూర్తి వివరాలతో సమర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.గురువారం పటాన్‌చెరు డివిజన్‌లోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్‌ఐఆర్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 30 ప్రచార రథాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతోనే ఒక ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, ఆ భాగస్వామ్యానికి తొలి మెట్టు ఓటు హక్కేనని స్పష్టం చేశారు.పటాన్‌చెరులో శాశ్వతంగా నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో పాల్గొనని వారు తమ విలువైన ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజాస్వామ్య బలోపేతానికి, పటాన్‌చెరు అభివృద్ధి ప్రస్థానంలో భాగస్వాములు కావాలంటే ప్రతి ఓటరు బాధ్యతగా ఎస్‌ఐఆర్‌లో పాల్గొనాలని కోరారు.నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది డివిజన్లు, మూడు మున్సిపాలిటీలు, రెండు మండలాల్లోని ప్రతి వార్డు వరకు ఈ ప్రచార రథాలు చేరుకుని ప్రజలకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పిస్తాయని తెలిపారు. అలాగే ప్రార్థనా స్థలాలు, క్రీడా ప్రాంగణాలు, విద్యా సంస్థలు, పార్కులు, మార్కెట్లు, పారిశ్రామిక ప్రాంతాలు తదితర ప్రజా ప్రదేశాల్లో వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ఎస్‌ఐఆర్ ప్రాముఖ్యతను విస్తృతంగా తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *