జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..!
అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..!
ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి, నిర్లక్ష్యం సహించేది లేదు..!
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
రూ.1,200 కోట్ల భారీ వ్యయంతో మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు చేపడుతున్న జాతీయ రహదారి–65 విస్తరణ పనుల్లో జరుగుతున్న తీవ్ర నిర్లక్ష్యం, నాణ్యతా లోపాలపై పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యం కోసం చేపట్టిన అభివృద్ధి పనులను కొందరు కాంట్రాక్టర్లు తమ స్వార్థ ప్రయోజనాలకు వేదికగా మార్చుకున్నారని మండిపడ్డారు.మంగళవారం సాయంత్రం పటాన్‌చెరులోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారుల సంస్థ అధికారులు, కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని బీహెచ్ఈఎల్ చౌరస్తా నుంచి రుద్రారం గణేష్ గడ్డ వరకు జరుగుతున్న రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా గాలికొదిలేశారని ఆయన ఆరోపించారు. నిర్మించిన కొద్ది రోజులకే సర్వీస్ రోడ్లు దెబ్బతినడం, వర్షపు నీటి కాలువలు కూలిపోవడం అధికారుల పర్యవేక్షణ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.రహదారి విస్తరణలో వెలికితీసిన విలువైన మట్టిని ప్రజా అవసరాలకు వినియోగించకుండా ప్రైవేట్ సంస్థలకు అమ్ముకోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు ఆ మట్టిని అందించాలని ఎన్నిసార్లు కోరినా స్పందించకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.రహదారి విస్తరణలో తొలగించిన మహనీయుల విగ్రహాలను పటాన్చెరు సాకి చెరువు కట్టపై ప్రతిష్ఠించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు.ఇప్పటివరకు 20 సార్లకు పైగా సమీక్ష సమావేశాలు నిర్వహించినా పనుల్లో ఎలాంటి మార్పు కనిపించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.కాంట్రాక్టర్లు, అధికారులు వెంటనే తమ పనితీరును మార్చుకుని నాణ్యతతో పనులు పూర్తి చేయాలని, లేకపోతే ప్రజల తరఫున కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చేస్తానని హెచ్చరించారు.ఈ సమీక్ష సమావేశంలో జాతీయ రహదారుల సంస్థ డీఈ సందీప్, కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు
