మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. చెరువుల బఫర్ జోన్లు, ఎఫ్టిఎల్ పరిధిలోని స్థలాల ఆక్రమణకు ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు.మంగళవారం సాయంత్రం నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. బీరంగూడ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో గల పోచమ్మ కుంట, అమీన్పూర్ డివిజన్ పరిధిలోని దయారా పరిధిలోని జంగంకుంటల పరిధిలో చెరువు సరిహద్దులను నిర్ణయించి సుందరీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. వడక్పల్లి గ్రామ చెరువు బఫర్ జోన్ పరిధిలో ప్రముఖ నిర్మాణ సంస్థ బఫర్ జోన్ ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించిందని స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగిందని.. వెంటనే దానిని తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. భవిష్యత్తు తరాలకు నీటి వనరులను అందిస్తూ ప్రకృతి సమతుల్యతకు కీలకమైన చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని.. ఆక్రమణలకు పాల్పడితే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ఈఈ భీమ్, డిఈ బాల గణేష్, తదితరులు పాల్గొన్నారు.
