-పదో తరగతి,ఇంటర్, డిగ్రీ తొలి సంవత్సరం విద్యార్థుల ప్రతిభకు గుర్తింపుగా సత్కారం
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
తెలంగాణ ప్రగతిశీల తల్లిదండ్రుల కమిటీ (పీపీఎల్) రాష్ట్ర ఆధ్వర్యంలో ఎల్‌బీనగర్‌లోని బాబు జగ్జీవన్‌రామ్ ప్రాంగణంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి, విద్యార్థినులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. విద్య ద్వారా సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, విద్యార్థులు కష్టపడి చదివి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షల్లో 566 మార్కులు సాధించిన విద్యార్థిని మాల మాళవికను ప్రత్యేకంగా అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఆమె తల్లి ప్రశాంతిని కూడా శాలువాతో సన్మానించి, తమ కుమార్తె విద్యాభ్యాసానికి అందించిన ప్రోత్సాహాన్ని కొనియాడారు.ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా మరింత మంది విద్యార్థులకు స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల తల్లిదండ్రుల కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మంగోలి నగేష్, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి కైతలాపురం రాములుతో పాటు కమిటీ నాయకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్ అభివృద్ధికి పీపీఎల్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తామని నాయకులు పేర్కొన్నారు.
