మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
కష్టకాలంలో పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, పేదల ఆరోగ్య భద్రతకు ఈ నిధి ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
సోమవారం చిట్కుల్ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని కానుకుంటకి చెందిన కుమ్మరి రామదాసు( 60,000/-), ఇస్నాపూర్ మున్సిపాలిటీకి చెందిన అడపా ఎల్లమ్మ( 60,000/-) గార్లకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందని తెలిపారు.
సరైన సమయంలో వైద్యం అందక, అప్పుల పాలవుతున్న ఎన్నో కుటుంబాలను ప్రభుత్వం ఈ నిధి ద్వారా ఆదుకుంటోందని, నిరుపేదలు అనారోగ్యం బారిన పడినప్పుడు అధైర్యపడకుండా ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనేదే తమ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా నిధులు మంజూరయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ గోపాల్ రెడ్డి, మన్నే రాఘవేంద్ర, నారాయణదాసు, మణికంఠ, సర్పంచ్ కొరివి సురేష్, మాజీ ఉప సర్పంచ్ శోభకృష్ణ రెడ్డి, స్థానిక నాయకులు శ్రీనివాస్, వీరేష్, నర్సింలు, రాము, వెంకటేష్, బిక్షపతి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
