‘గేట్’ ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోండి

Telangana

గీతం విద్యార్థులకు గేట్ ఏరోస్పేస్ అకాడమీకి చెందిన అశోక్ నాయుడు సూచన

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (GATE) శ్రేష్ఠతకు ముఖద్వారం వంటిదని, దానిలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా విజయవంతమైన వృత్తికి అపార అవకాశాలను అందిపుచుకోవచ్చని గేట్ ఏరోస్పేస్ అకాడమీకి చెందిన అశోక్ నాయుడు అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.

ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ నాతి వేణుకుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మహమ్మద్ అక్తర్ ఖాన్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అశోక్ నాయుడు ప్రసంగిస్తూ, గేట్ ద్వారా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు అందుబాటులో ఉన్న విస్తృత శ్రేణి ఉద్యోగ అవకాశాలను వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్ యూలు), రక్షణ సంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రైవేటు రంగంలో ఉన్న అవకాశాలను ప్రముఖంగా ప్రస్తావించారు.

రక్షణ రంగంలోని వివిధ అవకాశాలను అశోక్ నాయుడు వివరిస్తూ, వాటిలో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT), కంబైన్డ్ ఢిఫెన్స్ సర్వీసెస్ (CDS), షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) టెక్నికల్, యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ (UES), టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC), NCC ద్వారా ప్రవేశం వంటివి ఉన్నాయన్నారు. వీటితో పాటు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వంటి సంస్థలలోని ఉద్యోగావకాశాల గురించి కూడా తెలియజేశారు.

అంతే కాకుండా, పరిశోధన, ఉన్నత విద్యలో ఉన్న అవకాశాలను అన్వేషించమని అశోక్ నాయుడు విద్యార్థులను ప్రోత్సహించారు. వాటిలో రక్షణ రంగ పరిశోధనా సంస్థ (DRDO/DRDL)లో శాస్త్రవేత్తలుగా, భారత వైమానిక దళంలో టెక్నికల్ ఆఫీసర్లుగా, సీఎస్ఐఆర్ కింద జూనియర్ రీసెర్చ్ ఫెలోలుగా (JRFs), ఐఐటీలు, ఐఐఎస్సీ వంటి ప్రముఖ సంస్థలలో పీజీ, పీహెచ్.డీ. వంటి కోర్సులలో చేరవచ్చని ఆయన తెలియజేశారు. లక్ష్యించిన దానిని ఏకాగ్రతతో సాధించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అశోక్ నాయుడు విద్యార్థులకు ఉద్బోధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *