-పటాన్చెరు మినీ ఇండియా.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక
-అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండాలి.. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
-ఇందిరాగాంధీ హయాంలో ఏర్పాటైన పరిశ్రమలతో దేశంలోని వివిధ ప్రాంతాల వారికి ఉపాధి అవకాశాలు
-కుల మత బేధం లేకుండా అందరి సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి:
పటాన్చెరు ప్రాంతం మినీ ఇండియాను తలపిస్తోందని, వివిధ రాష్ట్రాలు, భాషలు, మతాలు, కులాలకు చెందిన ప్రజలు ఇక్కడ కలిసి జీవించడం మన ప్రాంత ప్రత్యేకత అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉంటూ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం పటాన్చెరు సాకి చెరువు వద్ద నిర్వహించిన ఛట్ పూజ వేడుకల్లో ఆయన పాల్గొని ఉత్తర భారతీయులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఆనాడు ఇందిరాగాంధీ హయాంలో పటాన్చెరు ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడంతో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎంతోమందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు పటాన్చెరును తమ సొంత ప్రాంతంగా భావిస్తూ ఇక్కడే స్థిరపడ్డారని అన్నారు.

పటాన్చెరు పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.తెలంగాణ సంస్కృతి, ఉత్తర భారత సంప్రదాయాలు సహా వివిధ ప్రాంతాల ఆచారాలు ఇక్కడ కలగలిసి కనిపిస్తాయని, ప్రతి పండుగను అందరూ కలిసి జరుపుకోవడం పటాన్చెరు ఐక్యతకు నిదర్శనమని అన్నారు. ఛట్ పూజ సూర్యభగవానుడిని ఆరాధించే పవిత్రమైన పండుగని, కుటుంబాల సుఖసంతోషాలు, ఆరోగ్యం కోసం భక్తులు ఎంతో నియమనిష్ఠలతో పూజలు నిర్వహించడం అభినందనీయమన్నారు.కులం, మతం, ప్రాంతం అనే తేడాలు లేకుండా అందరూ ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉండాలని, ఒకరి సంప్రదాయాలను మరొకరు గౌరవించుకోవాలని నీలం మధు ఆకాంక్షించారు. పటాన్చెరు మినీ ఇండియా స్ఫూర్తిని కొనసాగిస్తూ శాంతి, సోదరభావం, ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని కొనియాడారు.ఛట్ పూజ సందర్భంగా ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రజలందరికీ సూర్యభగవానుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయుసి జిల్లా అధ్యక్షులు, పటాన్ చెరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొల్కురి నర్సింహారెడ్డి, యూత్ కాంగ్రెస్ ఫోటోకాల్ చైర్మన్ పట్లోళ్ల ఆదిత్య రెడ్డి, ఎట్టయ్యా, నిర్వాహకులు మున్నా యాదవ్, కిషన్, నేతాజీ, బలం సింగ్, షారుక్, లాలన్,ప్రమోద్, వికాస్, గౌతమ్, సాగర్, నాయకులు రవి, వెంకటేష్, శ్రీను, రాజు, సాయి, భక్తులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
