-అక్టోబర్ 7న సంగారెడ్డిలో 11వ రాష్ట్ర మహాసభలు
-మహాసభలకు హాజరు కావాలని డీజెఎఫ్ నాయకుల ఆహ్వానం
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
దళిత జర్నలిస్టుల ఫోరం (డీజెఎఫ్) 11వ రాష్ట్ర మహాసభలకు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని డీజెఎఫ్ నాయకులు మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు. అక్టోబర్ 7న సంగారెడ్డిలో నిర్వహించనున్న మహాసభల పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మహాసభల కరపత్రాన్ని ఆయనకు అందజేశారు. డీజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి మాట్లాడుతూ దళిత జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం సంఘం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలపై పోరాటానికి డీజెఎఫ్ ముందుంటుందని తెలిపారు. దళిత జర్నలిస్టుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్, ఇళ్ల స్థలాలు, ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య, అర్హులకు ఉచిత బస్, రైలు పాసులు, నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. దళిత జర్నలిస్టులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించడంతో పాటు, అకాల మరణం చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు రాపాక విజయ్ రాజు,సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ముక్కగల్ల యాదన్న, పుల్కల్ మండల డీజెఎఫ్ అధ్యక్షుడు రవికుమార్, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డిలో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీజెఎఫ్ నాయకులు కోరారు.
