20 వేల మందితో మెగా రన్, రూ.75 లక్షల ప్రైజ్‌పూల్
తొలిసారిగా ఏఐఎంఎస్ ధ్రువీకరించిన 21.097 కి.మీ. హాఫ్ మారథాన్
మైల్స్ ఫర్ మామోగ్రామ్స్’తో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌కు చేయూత
ప్రపంచవ్యాప్తంగా పాల్గొనేందుకు ఉచిత వర్చువల్ రన్
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :
ఆరోగ్యం ఫిట్నెస్ మహిళల ఆరోగ్యంపై అవగాహన సామాజిక సేవను మేళవిస్తూ నిర్వహిస్తున్న ‘పింక్ పవర్ రన్’ మూడో ఎడిషన్‌కు హైదరాబాద్ సిద్ధమవుతోంది. సుధా రెడ్డి ఫౌండేషన్, ఎంఈఐఎల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ హాఫ్ మారథాన్, కమ్యూనిటీ ఫిట్నెస్ కార్యక్రమంగా పింక్ పవర్ రన్ 3.0ను ఈ నెల 27న నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. ఈసారి కార్యక్రమాన్ని మరింత భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 20 వేల మందికి పైగా పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తుండగా.. మొత్తం రూ.75 లక్షల ప్రైజ్‌పూల్‌ను ప్రకటించారు. 100 మందికి పైగా విజేతలకు నగదు బహుమతులు అందించనున్నారు.సోమవారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుధా రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఎంఈఐఎల్ డైరెక్టర్ సుధా రెడ్డి, 2025 మిస్ వరల్డ్ ఒపల్ సుచతా చువాంగ్, బ్రెస్ట్ ఆంకోసర్జన్ డాక్టర్ ప్రజ్ఞ చిగురుపాటి పాల్గొన్నారు. రన్ లో పాల్గొనే వారు ధరించే టి షర్ట్, విజేతలకు అందచేసే మెడల్స్ విడుదల చేశారు. రన్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సుధా రెడ్డి మాట్లాడుతూ.. పింక్ పవర్ రన్ కేవలం ఒక క్రీడా కార్యక్రమం కాదని, ఆరోగ్యం, ఫిట్నెస్, వ్యాధుల నివారణ, ముందస్తు వైద్య పరీక్షల ప్రాధాన్యాన్ని ప్రజలకు గుర్తుచేసే ఉద్యమమని అన్నారు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే భావనను ప్రతి కుటుంబానికి చేరువ చేయాలన్నదే కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.ఆరోగ్యవంతమైన సమాజమే బలమైన, చురుకైన ఆర్థిక వ్యవస్థకు పునాది అవుతుందని ఆమె అన్నారు.

ఫిట్నెస్ను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడంతోపాటు మహిళల ఆరోగ్యం, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచడం అత్యంత అవసరమని చెప్పారు. ఇప్పటికే రెండు ఎడిషన్ల ద్వారా ప్రజల్లో మంచి స్పందన పొందిన పింక్ పవర్ రన్‌ను మూడో ఎడిషన్‌లో మరింత విస్తృత ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. వేలాది మంది ఒకే సంకల్పంతో ముందుకు సాగినప్పుడు ప్రతి అడుగు ఆశకు, సంఘీభావానికి, సామాజిక మార్పుకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.
తొలిసారిగా ఏఐఎంఎస్ ధ్రువీకరణ
పింక్ పవర్ రన్ 3.0లో తొలిసారిగా అధికారిక 21.097 కిలోమీటర్ల హాఫ్ మారథాన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ హాఫ్ మారథాన్‌కు అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మారథాన్స్ అండ్ డిస్టెన్స్ రేసెస్ (ఏఐఎంఎస్) ధ్రువీకరణ లభించింది. దీంతో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న పింక్ పవర్ రన్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు మరింత పెరగనుంది. హాఫ్ మారథాన్‌తోపాటు 10 కి.మీ., 5 కి.మీ., 3 కి.మీ. విభాగాల్లోనూ పరుగులు నిర్వహించనున్నారు.రూ.75 లక్షల భారీ ప్రైజ్‌పూల్ ఉండటంతో దేశంలోని ప్రముఖ అథ్లెట్లతోపాటు అంతర్జాతీయ స్థాయి రన్నర్లు కూడా ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ప్రొఫెషనల్ అథ్లెట్లతోపాటు సాధారణ ఫిట్నెస్ ఔత్సాహికులు, కుటుంబాలు, విద్యార్థులు, కార్పొరేట్ ఉద్యోగులు, రన్నింగ్ క్లబ్‌ల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
తెలంగాణలో రొమ్ము క్యాన్సర్‌పై ప్రత్యేక దృష్టి
రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలకు పింక్ పవర్ రన్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. డాక్టర్ ప్రజ్ఞ చిగురుపాటి మాట్లాడుతూ.. తెలంగాణలో రొమ్ము క్యాన్సర్ కేసుల భారం ఆందోళన కలిగించే స్థాయిలో ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ముందస్తు గుర్తింపు, వైద్య పరీక్షలపై అవగాహన మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా చికిత్స ఫలితాలను మెరుగుపరచవచ్చని, అందుకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం కీలకమని వివరించారు. మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు పరీక్షలను అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. ఆరోగ్యంపై అవగాహనను కేవలం నగరాలకే పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాలకూ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.
సెప్టెంబర్ 27న నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా జరిగే పింక్ పవర్ రన్ 3.0లో 3 కి.మీ., 5 కి.మీ., 10 కి.మీ. పరుగులతోపాటు 21.097 కి.మీ. హాఫ్ మారథాన్ నిర్వహించనున్నారు. 20 వేల మందికి పైగా పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. రూ.75 లక్షల మొత్తం ప్రైజ్‌పూల్‌తో 100 మందికి పైగా విజేతలకు బహుమతులు అందించనున్నారు.పింక్ పవర్ రన్ హైదరాబాద్‌లో మరోసారి ‘పింక్’ సందడిని తీసుకురావడమే కాకుండా.. ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం, మహిళల ఆరోగ్యంపై అవగాహన, ఫిట్‌నెస్‌పై ఆసక్తి, సామాజిక బాధ్యతను ఒకే వేదికపైకి తీసుకురానుంది. ఆరోగ్యకరమైన, చురుకైన, మరింత సాధికారత కలిగిన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
