మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, భౌతిక శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి ఐ.ఎస్. రవి వర్మ డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘నానోకాంపోజిట్ పాలిమర్ బ్లెండ్ ఎలక్ట్రోలైట్లలో సోడియం అయాన్ ప్రసరణ యంత్రాంగం యొక్క అధ్యయనం’ చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ భౌతిక శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. రమేష్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ రవి వర్మ పరిశోధన తదుపరి తరం శక్తి నిల్వ వినియోగం కోసం అధునాతన నానోకాంపోజిట్ పాలిమర్ ఎలక్ట్రోలైట్ ఫిల్మ్ ల అభివృద్ధిపై దృష్టి సారించినట్టు తెలియజేశారు. ఈ అధ్యయనంలో NaPF₆ లవణం, ఇథలీన్ కార్బోనేట్ ప్లాస్టిసైజర్, Al₂O₃, నానోఫిల్లర్ ను చేర్చిన పాలిమర్ బ్లెండ్ ఎలక్ట్రోలైట్ వ్యవస్థను సంశ్లేషణ చేయడం ద్వారా గది ఉష్ణోగ్రత వద్ద మెరుగైన అయానిక వాహకతను సాధించారన్నారు.ఈ పరిశోధనలో, FTIR, DSC, SEM, XRD, ఎలక్ట్రోకెమికల్ ఇంపిడెన్స్ స్పెక్ట్రోస్కోపీ వంటి అధునాతన లక్షణీకరణ పద్ధతులను ఉపయోగించి, అభివృద్ధి చేసిన ఫిల్మ్ ల యొక్క నిర్మాణాత్మక, విద్యుత్, విద్యుద్వాహక, విద్యుత్ రసాయన ధర్మాలను అన్వేషించినట్టు తెలిపారు. సురక్షితమైన, అధిక పనితీరు గల సాలిడ్-స్టేట్ సోడియం-అయాన్ బ్యాటరీలు, పునరుత్పాదక శక్తి నిల్వ వ్యవస్థలు, సూపర్ కెపాసిటర్లు, ఫ్యూయల్ సెల్స్, ఎలక్ట్రోక్రోమిక్ పరికరాలు, ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్స్ లో ఈ పదార్థాన్ని ఉపయోగించడానికి బలమైన సామర్థ్యం ఉందని ఈ పరిశోధన ఫలితాలు నిరూపిస్తున్నాయని వివరించారు.భవిష్యత్ శక్తి సాంకేతికతల కోసం సమర్థవంతమైన, సుస్థిరమైన సాలిడ్-స్టేట్ ఎలక్ట్రోకెమికల్ పరికరాల అభివృద్ధికి ఈ అధ్యయనం గణనీయంగా దోహదపడుతుందని భావిస్తున్నామన్నారు.డాక్టర్ రవి వర్మ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, భౌతిక శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ టి.విశ్వం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందనలు తెలియజేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
