మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :
వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలను సత్కరిస్తూ బృహస్పతి మరియు ప్రైడ్ మోటర్స్ సహకారంతో నిర్వహించిన ఈటీ ఎక్సలెన్స్ తెలంగాణ 2026 అవార్డుల ప్రదానం కార్యక్రమం హైదరాబాద్లోని నోవాటెల్ లో వైభవంగా జరిగింది. పరిశ్రమలు, ఐటీ, ఆరోగ్య సంరక్షణ, విద్య, రియల్ ఎస్టేట్, తయారీ, సేవారంగం, సామాజిక సేవ తదితర విభాగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మరియు సినీనటుడు సోను సూద్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ ప్రతినిధులు, వైద్యులు, విద్యావేత్తలు మరియు వివిధ రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధికి విశేషంగా తోడ్పడుతున్న వ్యక్తులు, సంస్థల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఆవిష్కరణలు, నాయకత్వం, వ్యాపార నైపుణ్యం, సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతున్న సంస్థలను ఈ వేదిక ద్వారా గౌరవించడం ఆనందదాయకమని పేర్కొన్నారు.అవార్డులు అందుకున్న ప్రతినిధులు ఈ గుర్తింపు తమ సంస్థలకు మరింత బాధ్యతను పెంచుతుందని, భవిష్యత్తులోనూ నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని విజేతలను అభినందించారు.

