భిన్న సంస్కృతులు.. విభిన్న సంప్రదాయాలు.. భక్తి పారవశ్యంలో ఛట్ పూజా వేడుకలు

politics Telangana

సబ్బండ వర్గాల సంస్కృతికి ప్రతీక పటాన్‌చెరు

అన్ని వర్గాల ప్రజలను గౌరవించడం తెలంగాణ ప్రజల గొప్ప సంస్కారం

పటాన్‌చెరు నియోజకవర్గంలో ఉత్తర భారతీయుల సంక్షేమం..అభివృద్ధికి.. ప్రత్యేక కృషి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

సాకి చెరువు వేదికగా అంగరంగ వైభవంగా ఛట్ పూజా ఉత్సవాలు ప్రారంభం

మైత్రి మైదానంలో ప్రత్యేక ఆకర్షణగా భోజ్‌పురి గాయకుడు రితేష్ పాండే, గాయని కావ్య సంగీత విభావరి

జై ఛట్టి మయ్య నినాదాలతో మార్మోగిన మైత్రి మైదానం.. వేలాదిగా తరలివచ్చిన ఉత్తర భారతీయులు

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

సబ్బండ వర్గాల సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా భిన్న భాషలు, విభిన్న ప్రాంతాలు, వైవిధ్యమైన ఆచార వ్యవహారాలకు సముచిత గౌరవం కల్పించే సామరస్యానికి ప్రతీకగా పటాన్‌చెరు నియోజకవర్గం నిలుస్తోందని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదరించడం, వారి సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం తెలంగాణ ప్రజల గొప్ప సంస్కారమని పేర్కొన్నారు.ఉత్తర భారతీయులు అత్యంత పవిత్రంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజా మహోత్సవాలను పురస్కరించుకొని పటాన్‌చెరు పట్టణంలోని సాకి చెరువు వేదికగా ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్‌చెరు మైత్రి మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి, జాగరణ కార్యక్రమాలు భక్తులను, ఉత్తర భారతీయులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాకి చెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఈ వేడుకలకు ప్రముఖ భోజ్‌పురి గాయకుడు రితేష్ పాండే, ప్రముఖ గాయని కావ్య ముఖ్య ఆకర్షణగా నిలిచారు. తమ మధురమైన గాత్రంతో ఆలపించిన పాటలు, సంగీత ప్రదర్శనలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. వేలాదిగా తరలివచ్చిన ఉత్తర భారతీయులు సంగీత విభావరిని ఆస్వాదిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. జై ఛట్టి మయ్య, ఛట్ మయ్య కీ జై అంటూ చేసిన నినాదాలతో మైత్రి మైదానం మార్మోగిపోయింది. పండుగ వాతావరణం నెలకొనడంతో పరిసర ప్రాంతాలన్నీ సందడిగా మారాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గంలో విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు, ప్రాంతాలకు చెందిన ప్రజలు కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు.ఉపాధి, వ్యాపార, ఉద్యోగ అవకాశాల కోసం ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పటాన్చెరు ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారని, స్థానిక ప్రజలతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారని పేర్కొన్నారు.పటాన్‌చెరు అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో కీలకమని, ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరినీ తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రాంతం, భాష, మతం, కులం అనే భేదాలు లేకుండా అందరికీ సమాన గౌరవం, సముచిత ప్రాధాన్యత కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు. ఉత్తర భారతీయుల సంక్షేమం, అభివృద్ధి, వారి అవసరాల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఛట్ పూజ కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, ప్రకృతి ఆరాధనకు, సూర్యభగవానుడిపై భక్తికి, కుటుంబ క్షేమం, ఆరోగ్యం, సుఖసంతోషాల ఆకాంక్షకు ప్రతీకగా నిలిచే గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయమని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఇటువంటి పవిత్ర ఆచారాలను భావితరాలకు పరిచయం చేయడంతోపాటు, ప్రతి ఒక్కరూ తమ సంస్కృతి సంప్రదాయాలను స్వేచ్ఛగా జరుపుకునేలా ప్రోత్సహించడం సమాజంలోని ఐక్యతను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.పటాన్‌చెరు నియోజకవర్గంలో అన్ని పండుగలను, అన్ని వర్గాల ఆచార వ్యవహారాలను సముచితంగా గౌరవిస్తూ సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఉత్తర భారతీయులు ఎంతో భక్తితో నిర్వహించుకునే ఛట్ పూజా వేడుకలకు అవసరమైన సహకారం అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.గత 20 సంవత్సరాలుగా పటాన్‌చెరు వేదికగా ఛట్ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *