మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ దేశవ్యాప్తంగా ఆగస్టు 10న నిర్వహిస్తున్న “జైల్ భరో” కార్యక్రమాన్ని కార్మికులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పట్టోళ్ళ పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు. పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ పరిశ్రమలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో శాండ్విక్ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, కార్మికుల ఎన్నో దశాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ల పేరుతో నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ కోడ్స్ అమల్లోకి వస్తే ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని, పని గంటలు పెరిగే ప్రమాదం ఉందని, యజమానులకు కార్మికులను బానిసల్లా వాడుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. సులభంగా కార్మికులను తొలగించడానికి యాజమాన్యాలకు అవకాశాలు ఉంటాయని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనం వెంటనే పునర్ పరిశీలించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని అలాగే జోనల్ విధానం రద్దు చేయాలని ఎక్కడ పని చేసిన ఒకే రకమైన వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 6 ని వెంటనే పటాన్చెరు ప్రాంతంలోని పరిశ్రమలు అమలు చేయాలని అమలు చేయని పరిశ్రమల మీద కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం వెంటనే నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే విధానాలను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.అన్ని పరిశ్రమల కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి. ప్రదీప్ కుమార్ కాంట్రాక్టు కార్మికులు నాయకులు పాల్గొన్నారు.
