సృజనాత్మక ‘ఎకో-ఏకదంత’ కార్యక్రమాన్ని నిర్వహించిన గీతం విద్యార్థులు
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు, గణేష్ చతుర్థిని పర్యావరణపరంగా బాధ్యతా యుతంగా జరుపుకోవడాన్ని ప్రోత్సహించేందుకు, ఆసక్తికరమైన, సృజనాత్మకమైన ‘ఎకో-ఏకదంత’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.వివిధ విభాగాల విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా సహజమైన మట్టిని ఉపయోగించి గణేష్ విగ్రహాలను తయారు చేసి, వారు తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. జీవవిచ్ఛిన్నమయ్యే పదార్థాలను ఎంచుకోవడం, విషపూరిత రంగులు, ప్లాస్టిక్ అలంకరణలకు దూరంగా ఉండటం, వ్యర్థాలను తగ్గించడం, సురక్షితమైన, నిర్దేశిత నిమజ్జన పద్ధతులను పాటించడం యొక్క ప్రాముఖ్యతను ఈ కార్యక్రమం చాటి చెప్పింది.గణేష్ చతుర్థి విశ్వాసం, కళ, సమాజం, వేడుకలను అందంగా ఏకం చేస్తుంది. అయితే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ), జీవవిచ్ఛిన్నం కాని అలంకరణలు, హానికరమైన పెయింట్స్ వంటి పదార్థాల వాడకం నిమజ్జనం సమయంలో జలాశయాలు, చెరువులు, నీటి వనరులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.హరితమయమైన, మరింత బాధ్యతాయుతమైన గణేష్ చతుర్థి దిశగా మొదటి, అత్యంత ముఖ్యమైన అడుగుగా సహజమైన మట్టి విగ్రహాలను ఎంచుకోవాలని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమం ముగిసింది.

