-350 మంది విద్యార్థులతో శాస్త్రీయ ప్రదర్శన
– విద్యార్థుల ప్రతిభను అభినందించిన డీఆర్డీఎల్ శాస్త్రవేత్త రాజ్‌కుమార్
– విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలి
– పాఠశాల ప్రిన్సిపాల్ జనార్ధన్ రెడ్డి
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి:
విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం, పరిశోధనా ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో స్కాలర్స్ హైస్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్కాలర్స్ ఇన్నోవిస్టా–2026’ విద్యా ప్రదర్శన ఘనంగా ముగిసింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 350 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు రూపొందించిన వివిధ శాస్త్రీయ నమూనాలు, వర్కింగ్ మోడల్స్, వినూత్న ప్రాజెక్టులు సందర్శకులను ఆకట్టుకున్నాయి.ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ (డీఆర్డీఎల్), హైదరాబాద్ సైంటిస్ట్ ‘ఎఫ్’ వి. రాజ్‌కుమార్ హాజరై విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించి అభినందించారు. అనంతరం విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సమయపాలన పాటిస్తూ, స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకుని నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలని సూచించారు. దేశ అభివృద్ధికి తోడ్పడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
పాఠశాల ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ కె. జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాలు, పరిశోధనలు, నూతన ఆలోచనల ద్వారా సంపూర్ణమవుతుందని తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇన్నోవిస్టా గొప్ప వేదికగా నిలిచిందన్నారు. ప్రదర్శనను సందర్శించిన తల్లిదండ్రులు విద్యార్థుల ప్రతిభను అభినందించారు. కార్యక్రమ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, సహకరించిన తల్లిదండ్రులకు జనార్ధన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
