రైతాంగాన్ని నట్టేట ముంచిన దగాకోరు కాంగ్రెస్ సర్కార్ ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం :

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు గడిచినా రైతాంగానికి చేసింది శూన్యమని, నమ్మి ఓటేసిన రైతులను ఈ ప్రభుత్వం నట్టేట ముంచిందని ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని డీసీఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా పౌర సరఫరా అధికారి జయశ్రీ తో ఫోన్ లో మాట్లాడారు. రైస్ మిల్లర్ల లోడింగ్, అన్లోడింగ్ సమస్యలపై ఆరా తీశారు. మిల్లర్ల మిల్లింగ్ కెపాసిటీ ఎంత? అందులో పారా బాయిల్డ్ రైస్, రా రైస్ మిల్లింగ్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ చొరవతో స్పందించిన అధికారులు ఈ రోజు నుంచి రోజుకు నాలుగు లారీల చొప్పున పంపించి, వారం రోజుల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే విడతలో సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పి కాలయాపన చేస్తూ రైతులను అప్పులపాలు చేసిందన్నారు.  పెట్టుబడి సాయం ‘రైతు భరోసా’ ఊసే లేదు. చివరికి అడిగినంత ‘యూరియా’ కూడా సకాలంలో సరఫరా చేయలేని చేతగాని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అష్టకష్టాలు పడి పండించిన పంటను కొనే నాథుడే లేడు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వారాల తరబడి కళ్లాల పైనే మొలకెత్తుతోంది. అకాల వర్షాలకు వడ్లు తడిసి ముద్దవుతుంటే, అన్నదాతల కన్నీళ్లు తుడిచేందుకు ప్రభుత్వ యంత్రాంగానికి తీరిక లేదు. తేమ శాతం నెపంతో క్వింటాకు 3 నుండి 5 కిలోల వరకు ‘తరుగు’ పేరిట మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. నాణ్యత తగ్గిందనే సాకుతో కనీస మద్దతు ధర కంటే తక్కువకే కొంటూ రైతుల శ్రమను దోచుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్ద టోకెన్ల కోసం రైతులు రోజుల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సి వస్తోంది. రాత్రింబవళ్లు చలికి, ఎండకు ఎండి, పాము కాట్లకు భయపడుతూ ధాన్యం కుప్పల వద్దే కాపలా కాయాల్సిన దుస్థితి వచ్చింది. కనీసం ధాన్యం నింపడానికి సరిపడా గన్నీ బ్యాగులు సరఫరా చేయలేకపోయారు. లారీల కొరత వల్ల రవాణా నిలిచిపోయి కొనుగోలు కేంద్రాలన్నీ గుట్టలుగా మారాయి.

పంట అమ్మి వారాలు, నెలలు గడుస్తున్నా రైతు ధాన్యం డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ కావడం లేదు. చేతిలో పైసల్లేక తదుపరి పంటకు పెట్టుబడి పెట్టలేక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక రైతులు మానసిక వేదనకు గురవుతున్నారు. ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని, దళారులు తక్కువ ధరలకే పంటను కొంటున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మిల్లర్లు, దళారులతో కుమ్మక్కై చేస్తున్న కృత్రిమ ఆలస్యమే అని స్పష్టమవుతోంది.కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే మొద్దునిద్ర వీడి, యుద్ధప్రాతిపదికన ప్రతీ గింజా కొనుగోలు చేయాలి. తరుగు పేరిట జరుగుతున్న దోపిడీని అరికట్టాలి. తడిసిన ధాన్యానికి సైతం మద్దతు ధర కల్పించి 48 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం ‘ అని అంజిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి, జిన్నారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, స్థానిక నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *