ప్రారంభానికి నోచుకోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య

politics Telangana

పటాన్ చెరులో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను వెంటనే ప్రారంభించాలి

వైద్య సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి సిపిఎం డిమాండ్

సిపిఎం పార్టీ పటాన్ చెరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

ఆసియా ఖండంలోని అతిపెద్ద పారిశ్రామిక వాడైన పటాన్ చెరు వాడలో 300 కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభానికి ఎందుకు నోచుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.సిపిఎం పార్టీ పటాన్ చెరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో శనివారం పటాన్ చెరు పట్టణంలోని ఫ్రీడం పార్కు వద్ద సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ వేలాది పరిశ్రమలు ఉన్న పటాన్ చెరు,పాశం మైలారం పారిశ్రామిక వాడలలో దాదాపు రెండు లక్షలకు పైగా కార్మికులు ఉన్నారని, అనునిత్యం ఇస్నాపూర్, పటాన్ చెరు ఇతర ప్రాంతాలకు ఎంతో మంది జాతీయ రహదారిపై ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతూ ఉంటారన్నారు. వారికి స్థానికంగా సదుపాయం లేక చందానగర్, హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని అన్నారు. జాతీయ రహదారి మీదుగా అనునిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. కార్మికుల ప్రయోజనం కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెంటనే ప్రారంభిస్తే అనేక ప్రమాదాలను నివారించవచ్చన్నారు. గత సంవత్సరం పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి పరిశ్రమ ప్రమాదంలో 54 మంది కార్మికులు మృతి చెందిన ఘటన మన కళ్ళముందే కదలాడుతుందన్నారు.

అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో ఉంటే అనేక ప్రమాదాలను అరికట్టడానికి, కార్మికుల ప్రాణాలను కాపాడడానికి, అవకాశం ఉండేదన్నారు. కార్మికుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని గత నాలుగు సంవత్సరాల క్రితం అప్పట్లో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం హాస్పిటల్ నిర్మాణాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. ఆస్పత్రి పూర్తయి సంవత్సరం గడుస్తున్న పేదలకు అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వయిస్తుందన్నారు. హాస్పిటల్ ను ప్రారంభం చేసే విషయంలో బి ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పై చేయి సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆ కారణంతో ఆస్పత్రి ప్రారంభానికి నోచుకోవడం లేదని వాపోయారు. పటాన్ చెరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభిస్తే పేదలకు వైద్యం అందుబాటులోకి రావటమే కాక అనేక ప్రమాదాలను నివారించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పటాన్ లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను వెంటనే ప్రారంభించి పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని, లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజానీకాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు, సిపిఎం పార్టీ ఏరియా కమిటీ సభ్యులు పాండురంగారెడ్డి, సత్తిబాబు, ప్రదీప్, నిరంజన్, శివరాజ్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *