మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
పటాన్ చెరు పట్టణంలోని జెపి కాలనీలో ఉన్న శ్రీ సత్యభామ రుక్మిణి సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గత 4 సంవత్సరాలుగా ఆలయ ధర్మకర్త, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తదితర ముఖ్య నాయకులు విచ్చేసి, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మాట్లాడుతూ ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పుష్పాలంకరణ మరియు కళ్యాణ మహోత్సవం కమనీయంగా నిర్వహించారు. ఇస్కాన్ బృందం వారి భజనలు, శ్రీ విద్యానికేతన్, యూరో కిడ్స్ స్కూల్ విద్యార్థుల నృత్యాలు భక్తులను ఎంతగానో అలరించాయి. అలాగే భార్గవి, ఐశ్వర్య రెడ్డి, సంధ్య డాన్స్ క్లాస్ విద్యార్థులు ప్రదర్శించిన ‘మహాభారత ఘట్టాలు’, రాధాకృష్ణుల నృత్య రూపకాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.సుమారు 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో సుమారు 15 వేల మంది భక్తులందరికీ ఘనంగా అన్నప్రసాద వితరణ చేపట్టారు. పటాన్ చెరు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మెట్టు రమా కుమార్ యాదవ్, మెట్టు ఎల్లేష్ యాదవ్, కుటుంబ సభ్యులు, ఆలయ, అన్నదాన, భజన కమిటీల సభ్యులు మరియు వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

