మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :
చెరువుల సంరక్షణ కోసం శరవేగంగా గుర్రపుడెక్క తొలగింపు పనులను చేపడుతున్నట్లు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువులో 70 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న గుర్రపు డెక్క తొలగింపు పనులను గురువారం ఉదయం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమయ్యే లోపు పనులు పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డివిజన్ పరిధిలోని తిమ్మక్క చెరువు, జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని దోషం చెరువులలోను ఒక కోటి రూపాయల అంచనా వ్యయంతో అతి త్వరలో గుర్రపు డెక్క తొలగింపు పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. గుర్రపు డెక్క తొలగించడం వలన చెరువు నీటి సామర్థ్యం పెరగడంతో పాటు చెరువుల పరిశుభ్రత మెరుగుపడటం, భూగర్భ జలాలు మట్టం పెరగడం వంటి లాభాలు జరుగుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సపాన దేవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు నివార్తి, ఎట్టయ్య, టప్ప కుమార్, నర్రా బిక్షపతి, వెంకటేష్, సత్తయ్య, రామ్మోహన్, ఏఈ ఫైజాన్, తదితరులు పాల్గొన్నారు.
