విజేతలకు నియామక పత్రాల అందజేత
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, ప్రాంగణ నియామకాలు, ఉన్నత విద్యలో విద్యార్థులు సాధించిన అద్భుతమైన విజయాలను గుర్తిస్తూ, శుక్రవారం అచీవర్స్ డే 2026ను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంది. వృత్తి మార్గదర్శక కేంద్రం (కెరీర్ గైడెన్స్ సెంటర్ – సీజీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం, విద్యా నైపుణ్యం, పరిశ్రమకు సన్నద్ధత, విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధి పట్ల విశ్వవిద్యాలయానికి ఉన్న బలమైన నిబద్ధతను ప్రతిబింబించింది.ఈ సందర్భంగా, 2026లో గ్రాడ్యుయేట్ అయ్యే బ్యాచ్ కు సంబంధించిన ప్రాంగణ నియామక ఫలితాలను గీతం ప్రకటించింది. జూలై 2026 నాటికి, ప్రాంగణ నియామకాలను ఎంచుకున్న 1,347 మంది విద్యార్థులలో 771 మంది (60 శాతం) ప్లేస్ మెంట్లు సాధించారు. విశ్వవిద్యాలయంలోని ఏడు స్కూళ్లలో 324 ప్రముఖ నియామక సంస్థల ద్వారా వెయ్యికి పైగా ఉద్యోగ ఆఫర్లు అందించారు.

గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ (జీఎస్బీ) 97.5 శాతం ఓవరాల్ ప్లేస్ మెంట్ రేటుతో అగ్రగామిగా నిలిచింది. ఇది అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో వంద శాతం, పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయిలో 95.8 శాతం ప్లేస్ మెంట్లను సాధించింది. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (జీఎస్ఏ) కూడా వంద శాతం ప్లేస్ మెంట్లను నమోదు చేసింది. స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులు 6.94 లక్షల వార్షిక ప్యాకేజీతో అత్యధిక సగటును సాధించగా, గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 544 ఉద్యోగ ఆపర్లతో, 443 మంది విద్యార్థుల ప్రాంగణ నియామకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సీజన్ లో అత్యధికంగా 16 లక్షల రూపాయల వార్షిక జీతం ప్యాకేజీని గీతం విద్యార్థులు సాధించారు.ఈ కార్యక్రమానికి పీడబ్యూసీ ఏసీ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆపరేషన్స్ లీడర్ (టాక్స్) జీ.టీ. కృష్ణ చైతన్య, టీసీఎస్ ప్రాంతీయ అధిపతి (అకడమిక్ అలయన్సెస్) రిచర్డ్ కింగ్ గౌరవ అతిథులుగా హాజరయ్యారు. సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, నిరంతర అభ్యాసం, ఆవిష్కరణ, వృత్తిపరమైన నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని విద్యార్థులను వారు ప్రోత్సహించారు. విజేతలకు కెరీర్ ఫుల్ ఫిల్ మెంట్ సర్టిఫికెట్లను అందజేశారు.

తొలుత, స్వాగతోపన్యాసంలో గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు మాట్లాడుతూ, ‘‘గీతం విద్యా ప్రమాణాలు, కెరీర్-సిద్ధత కార్యక్రమాలపై పరిశ్రమకు ఉన్న నిరంతర విశ్వాసాన్ని ఈ ఏడాది ప్లేస్ మెంట్ సీజన్ ప్రతిబింబిస్తోంది. వెయ్యికి పైగా ఉద్యోగ ఆఫర్లు, 16 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీతో, మా విద్యార్థులు పోటీతో కూడిన ప్రపంచ ఉద్యోగ మార్కెట్ లో రాణించగల తమ సామర్థ్యాన్ని మరోసారి ప్రదర్శించారు. పరిశ్రమ భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి, మా విద్యార్థులకు మరిన్ని కెరీర్ అవకాశాలను కల్పించడానికి మేము కట్టుబడి ఉన్నాం’’ అని అన్నారు.విజేతలైన జి.సృజన్ (సీఎస్ఈ), డి.వీణాశ్రీ (సీఎస్ఈ-ఏఐఎంఎల్), ఇ.జె.సంఘమిత్ర (ఈఈసీఈ), నిహారిక నోముల (ఎంబీఏ), పమిశెట్టి ప్రేమ్ కుమార్ (ఎమ్మెస్సీ డేటా సైన్స్) తమ ప్లేస్ మెంట్ అనుభవాలను, విజయ గాథలను పంచుకున్నారు. తల్లిదండ్రుల తరఫున జి.సృజన్ తండ్రి ఎన్.వి. శ్రీనివాస్ స్వరూప్, విశ్వవిద్యాలయ విద్యా వ్యవస్థను, కెరీర్ మార్గదర్శకత్వాన్ని ప్రశంసించారు.ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, అధ్యాపక సభ్యులు, విభాగాధిపతులు, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు తదితరులు హాజరయ్యారు. వీరిలో డాక్టర్ రమేష్ వడ్డి, ప్రొఫెసర్ జి.శివకుమార్, డాక్టర్ దివ్య కీర్తి గుప్తా, డాక్టర్ మోతహర్ రెజా, డాక్టర్ బందన్ కుమార్ మిశ్రా, డాక్టర్ శామ్యూల్ థరు, కెరీర్ గైడెన్స్ సెంటర్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఎడ్విన్ ఆంథోనీ, డైరెక్టర్ డాక్టర్ కె.మమత కూడా ఉన్నారు.
