వక్తలుగా పాల్గొన్న డాక్టర్ రథిన్ రాయ్, డాక్టర్ సుప్రీ రంజన్, సుర్వేష్ ప్రతాప్ సింగ్
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
‘మేధో క్షయం రాజకీయాలను కలిసినప్పుడు: బొద్దింక జనతా పార్టీ కథ’ అనే అంశంపై గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్), హైదరాబాదులోని రాజనీతి శాస్త్ర విభాగం సెప్టెంబరు 15న ఆలోచన రేకెత్తించే చర్చాగోష్ఠిని నిర్వహించింది.ప్రముఖ ఆర్థికవేత్త, జీఎస్ హెచ్ఎస్ డీన్ అయిన డాక్టర్ రథిన్ రాయ్ తో పాటు, రాజనీతి శాస్త్ర విభాగంలోని అధ్యాపకులైన డాక్టర్ సుప్రీ రంజన్, సుర్వేష్ ప్రతాప్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువ తరాలలో మారుతున్న రాజకీయ ఆకాంక్షలు, ఆర్థిక చైతన్యం, సామాజిక ఐక్యత, సాంకేతిక పరివర్తన, నిరసన ఉద్యమాలు, యువత-రాజకీయాల మధ్య అభివృద్ధి చెందుతున్న సంబంధం వంటి అంశాలను వక్తలు విశ్లేషించారు.డాక్టర్ రాయ్, శ్రేయస్సు, అసమానతల యొక్క మారుతున్న నమూనాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ, అభివృద్ధి చెందుతున్న రాజకీయ ఉద్యమాలను తీర్చిదిద్దడంలో ప్రతిఘటన, వీథి రాజకీయాలు, సాంకేతికత, యువత ఆకాంక్షల పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. డాక్టర్ సుప్రీ రంజన్ భారతదేశంలో, ముఖ్యంగా సరళీకరణ అనంతర కాలంలో యువజన ఉద్యమాల పరివర్తన గురించి, అలాగే ప్రతిభ, పరీక్షా పత్రాల లీకులు, వ్యవస్థాగత అసమానతలు వంటి సమస్యల వల్ల ఎదురయ్యే సవాళ్ల గురించి చర్చించారు. సుర్వేష్ ప్రతాప్ సింగ్ సాంస్కృతిక పునరుత్థానం, ఆర్థిక చైతన్యం, ప్రజా ప్రదేశాలు, వీథి స్థాయి భాగస్వామ్యంలో వేళ్లూనుకున్న ఒక ప్రక్రియగా ప్రజాస్వామ్యం అనే భావనపై మాట్లాడారు. విద్యార్థులు, అధ్యాపకులు అడిగిన పలు సందేహాలకు తగ్గ జవాబులిచ్చి వక్తలు ఆకట్టుకున్నారు. డాక్టర్ మయాంక్ మిశ్రా వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.
