మహనీయుల అడుగుజాడల్లో యువత నడవాలి యువజన వికాస్‌ సమితి అధ్యక్షుడు విజయకుమార్‌

politics Telangana

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

యువత విద్యార్థి దశ నుంచే దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని యువజన వికాస్‌ సమితి అధ్యక్షుడు విజయకుమార్‌ అన్నారు .దేశ నిర్మాణంలో ఇంజినీరింగ్‌ రంగానికి విశిష్ట సేవలందించిన మహనీయుడు, భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165వ జయంతి వేడుకలను పటాన్‌చెరు ప్రభుత్వ కళాశాల ఆవరణలో యువజన వికాస్‌ సమితి ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశానికి అందించిన సేవలను, ఇంజినీరింగ్‌ రంగంలో చేసిన విశేష కృషిని స్మరించుకున్నారు. అనంతరం యువజన వికాస్‌ సమితి అధ్యక్షులు విజయకుమార్‌ మాట్లాడుతూ మహనీయుల జయంతి వేడుకలను కేవలం ఉత్సవాలుగా కాకుండా, వారి జీవితాలు, సేవలు, ఆశయాలను నేటి తరానికి పరిచయం చేసే కార్యక్రమాలుగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే దేశం పట్ల బాధ్యత, సమాజం పట్ల సేవాభావం, క్రమశిక్షణ వంటి విలువలను అలవర్చుకోవాలని సూచించారు. దేశ భవిష్యత్తుకు మూలస్తంభాలైన యువత విద్యార్థి దశ నుంచే సమాజం, దేశ అభివృద్ధి కోసం ఆలోచించాలని అన్నారు. ‘దేశ అభివృద్ధికి క్రమశిక్షణ, ప్రణాళిక, కష్టపడి పనిచేయడం ఎంతో అవసరం అనే స్ఫూర్తిని ఆయన జీవితం మనకు అందిస్తుందని విజయకుమార్‌ అన్నారు. నేటి యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేశ ప్రగతికి తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.మహనీయులు దేశం కోసం చేసిన త్యాగాలు, సేవలను నేటి విద్యార్థులు తెలుసుకోవాలని, వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఎటువంటి ఆధునిక సాంకేతిక సౌకర్యాలు లేని కాలంలోనే దేశ అభివృద్ధి కోసం విశ్వేశ్వరయ్య వంటి మహనీయులు చూపిన అంకితభావం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ సమాజానికి, దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో యువజన వికాసం ప్రధాన కార్యదర్శి విజయకుమార్ గౌడ్, కోశాధికారి షణ్ముఖ, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, సహాయ కార్యదర్శి డి శంకర్, కార్యవర్గ సభ్యులు ప్రభు, మాణిక్యం, ప్రవీణ్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *