మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
తెలంగాణ సాయుధ పోరాట స్పూర్తితో ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి.జయరాజు పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ పటాన్ చెరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, వార్షికోత్సవాల సందర్భంగా శుక్రవారం శ్రామిక్ భవన్ లో జరిగిన సెమినార్ లో సిపిఎం జిల్లా కార్యదర్శి జి జయరాజు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేటికీ చరిత్రలో నిలిచిపోయిందని గుర్తు చేశారు. 1946 నుండి 1951 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందన్నారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఇతర జిల్లాలలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందని, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఐదు లక్షల ఎకరాలను పంచిపెట్టిన చరిత్ర తెలంగాణ సాయుధ రైతంగ పోరాటానికి ఉందన్నారు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుండి విముక్తి చేసేందుకు ఈ పోరాటం జరిగిందని, ఆనాడు నైజాం సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగిందని, జులై 4,1946,న ప్రారంభమై 1951 అక్టోబర్లో ముగిసిందని గుర్తు చేశారు.
ఈ పోరాటంలో దేశ్ ముక్ లు రజాకార్ల చేతుల్లో వేలాదిమంది సామాన్య ప్రజానీకం, కమ్యూనిస్టు పార్టీ నాయకులు ప్రాణాలు వదిలారని, అప్పటి కమ్యూనిస్టు పార్టీ అగ్ర నేత పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వం వహించారని గుర్తు చేశారు. ఈ పోరాటంలో దొడ్డి కొమరయ్య తొలి అమరుడు అయ్యారని, వీరనారి చాకలి ఐలమ్మ తన పొలంలో పంట కోసం దేశముకులకు వ్యతిరేకంగా పోరాటం జరిపిందన్నారు. బండి వెనక బండి కట్టి, 16 బండ్లు కట్టి ఏ బండ్ల పోతావ్ కొడుకో నైజాం సర్కారో డా అన్న పాట నేటికీ చరిత్రలో నిలిచిపోయిందని గుర్తు చేశారు. ఈ పోరాటం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరిగినప్పటికీ, ప్రస్తుత పాలకులు సెప్టెంబర్ 17న, తెలంగాణ విలీనం, విమోచనం పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, తెలంగాణ విలీనం జరిగిందని గుర్తు చేశారు. బిజెపి, టిఆర్ఎస్ లో తెలంగాణ సాయుధ రైతంగ పోరాటాన్ని చరిత్రను వక్రీకరిస్తున్నారని,తమ పాత్ర లేకున్నా వాడుకుంటున్నారని, ఈ పార్టీలు ఈ పోరాటానికి అర్హులు కారని మండిపడ్డారు.ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే అని గుర్తు చేశారు.
ఈ పోరాటం ద్వారానే భూమి పంచాలి అన్న నినాదం ప్రారంభమైందని,కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఆదాని, అంబానీ ల కోసం మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని, వారి సంపదను కాపాడుకునేందుకు వారికి బ్యాంకులు సబ్సిడీలు ఇస్తూ, సామాన్య ప్రజానీకం పైన విపరీతమైన భారాలు మోపుతున్నారని వాపోయారు . అందుకోసం భూమి, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్, ఇతర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ మాణిక్యం, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బి నాగేశ్వరరావు, ఎం రేవంత్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు ఎండి వాజిద్ అలీ, పి పాండురంగారెడ్డి, సిపిఎం నాయకులు సత్తిబాబు, వెంకట్ రామ్ రెడ్డి, ప్రదీప్, నల్లగండ్ల రాజు, బి జయరాం, యాక రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.
